Telugu Global
Telangana

కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు.. సోనియా లేఖను తప్పుబట్టిన ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకే సోనియాగాంధీ లేఖలో ఆ అంశాన్ని ప్రస్తావించలేదని చెప్పారు.

కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు.. సోనియా లేఖను తప్పుబట్టిన ఎమ్మెల్సీ కవిత
X

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిరంగ పరచాలని కోరుతూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అజెండా విషయం పక్కనపెడితే ప్రత్యేక సమావేశాల్లో చర్చించాలంటూ 9 అంశాలను సోనియా తన లేఖలో ప్రస్తావించారు. ఆ అంశాలపై అత్యవసర చర్చ జరగాలని ఆమె సూచించారు. అందులో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం మాత్రం లేదు. అంటే ఆ బిల్లు ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా అని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. సోనియా లేఖలో ఆ అంశం లేకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదంటూ ట్విట్టర్లో మండిపడ్డారు.


కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు..

మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకే సోనియాగాంధీ లేఖలో ఆ అంశాన్ని ప్రస్తావించలేదని చెప్పారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని ప్రశ్నించారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని విమర్శించారు కవిత.

బిల్లుకోసం పట్టు..

మహిళా బిల్లుకోసం ఆమధ్య ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేపట్టారు ఎమ్మెల్సీ కవిత. మహిళా ప్రతినిధుల మద్దతు కూడగట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అయితే బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ తప్పించుకుని తిరుగుతున్నాయని.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల విషయంలో ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. తాజాగా సోనీయా లేఖతో మరోసారి ఆ విషయం తేటతెల్లమైందని అన్నారు.

First Published:  6 Sep 2023 2:31 PM GMT
Next Story