Telugu Global
Telangana

సీబీఐ నోటీసులపై కవిత రియాక్షన్

సీబీఐ అభ్యర్థన మేరకు ఈనెల 6వ తేదీన తన ఇంటి వద్దే సీబీఐ అధికారులను కలుస్తానని తెలిపారు కవిత. వారు అడిగిన సమాచారాన్ని తెలియజేస్తానని చెప్పారు.

సీబీఐ నోటీసులపై కవిత రియాక్షన్
X


ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో తనకు సీబీఐ నోటీసులు అందినట్లు ధృవీకరించారు ఎమ్మెల్సీ కవిత. సీబీఐ పంపిన నోటీసుని, దానిపై ఆమె స్పందనను మీడియాకు తెలియజేశారు. లిక్కర్‌ స్కాంలో 160 సీఆర్పీసీ కింద వివరణ ఇవ్వాలని సీబీఐ తనకు నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు కవిత. వివరణ కోసం మాత్రమే తనకు నోటీసులు ఇచ్చారని, దీనిపై సీబీఐ అధికారులకు తాను తిరుగు సమాచారం ఇచ్చానన్నారామె. సీబీఐ అభ్యర్థన మేరకు ఈనెల 6వ తేదీన తన ఇంటి వద్దే సీబీఐ అధికారులను కలుస్తానని తెలిపారు కవిత. వారు అడిగిన సమాచారాన్ని తెలియజేస్తానని చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉద్దేశపూర్వకంగానే కవిత పేరుని చేర్చారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ లేదా ఈడీ నుంచి ఏ క్షణమైనా నోటీసులు వస్తాయనేది ముందుగా ఊహించిన విషయమే. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని భయపడేది లేదని కవిత స్టేట్ మెంట్ ఇచ్చిన ఒకరోజులోగా సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం. వివరణ కోసం సీబీఐ తాజాగా కవితకు నోటీసులు ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగస్వామ్యం లేదా అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో అమిత్ అరోడాను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను కోర్టులో హాజరు పరిచిన సందర్భంలో ఈడీ పొందుపరచిన రిమాండ్ రిపోర్ట్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల పేర్లు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బట్టబయలైన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో కేంద్రం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

First Published:  2 Dec 2022 5:38 PM GMT
Next Story