Telugu Global
Telangana

సందేహాలివి, సమాధానం చెప్పండి..

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని గుర్తు చేశారు.

సందేహాలివి, సమాధానం చెప్పండి..
X

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో అనేక సందేహాలున్నాయని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. కేవలం కాలయాపన చేసేందుకే దరఖాస్తులు తీసుకుంటున్నారనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. అసలు దరఖాస్తుల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. లబ్ధిదారులకు సాయం అందాలంటే కచ్చితంగా అకౌంట్ వివరాలు ప్రభుత్వానికి తెలియాలని, ఆ వివరాలు తీసుకోవట్లేదంటే.. కొత్త సందేహాలకు తావిచ్చినట్టేనని అన్నారు కవిత.


హన్మకొండలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నాయకులతో సమావేశమైన కవిత అనంతరం మీడియాతో మాట్లాడారు. సామాజిక పెన్షన్లను రూ.4వేలకు పెంచి ఆ తర్వాత కొత్త దరఖాస్తులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కొత్త దరఖాస్తులు తీసుకున్న తర్వాతే పెంపు ఉంటుందని అంటే అది కాలయాపన కాక ఇంకేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం దరఖాస్తు ఫామ్ లో బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు తీసుకోవడంలేదని, అంటే దానికోసం మళ్లీ దరఖాస్తు చేయాలా అని అడిగారు. 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు వినియోగించే వారికి ఉచిత కరెంట్‌ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే సందేహం ప్రజల్లో ఉందని గుర్తు చేశారు. మగవాళ్ల పేరుమీద గ్యాస్ సిలిండర్ ఉంటే.. రూ.500 సిలిండర్ పథకానికి వారు అర్హులా కాదా అని అడిగారు. నిరుద్యోగ భృతి వివరాలు కూడా ప్రజా పాలన దరఖాస్తులో లేవన్నారు కవిత.

మనోధైర్యం కోల్పోవద్దు..

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని, ఇలాంటి పరిస్థితులు కూడా వస్తుంటాయని గుర్తు చేశారు. సంయమనం పాటించి, ఓపికతో ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల మనసును గెలుచుకోవాలన్నారు. మళ్లీ మంచిరోజులొస్తాయన్నారు కవిత. ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు ఆమె సూచించారు.

First Published:  30 Dec 2023 7:32 AM GMT
Next Story