Telugu Global
Telangana

కవిత పిటిషన్ పై విచారణ.. ఈడీకి సుప్రీం నోటీసులు

బెయిల్ విషయంలో కవితను ట్రయల్ కోర్టుకి వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ కాబట్టి ట్రయల్‌ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

కవిత పిటిషన్ పై విచారణ.. ఈడీకి సుప్రీం నోటీసులు
X

ఈడీ అరెస్ట్ కి సంబంధించి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత ప్రస్తావించిన అంశాలపై సుప్రీం విచారణకు సిద్ధపడింది. అయితే గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు కవిత పిటిషన్ ను జత చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈడీ అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులోనే..

బెయిల్ విషయంలో కవితను ట్రయల్ కోర్టుకి వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం కేసు మెరిట్స్‌లోకి వెళ్లలేమని స్పష్టం చేసింది. బెయిల్ తాము ఇవ్వలేమని, కింది కోర్టును మొదట ఆశ్రయించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో మహిళ కాబట్టి ట్రయల్‌ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కవిత తరపున కపిల్ సిబల్ ఈ కేసులో వాదనలు వినిపించారు.

బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పడంతో కవిత తిరిగి రౌస్ అవెన్యూ కోర్టులోనే బెయిల్ పిటిషన్‌ వేయాల్సి ఉంటుంది. అయితే ఇదే కోర్టు ఈనెల 23వరకు ఆమెకు ఈడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. 23న తిరిగి ఆమెను కోర్టులో ప్రవేశపెడతారు. ఈలోగా బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో తిరిగి ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

First Published:  22 March 2024 5:55 AM GMT
Next Story