Telugu Global
Telangana

ఈడీపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్

గతంలో విచారణ సందర్భంగా అరెస్ట్ కోసం సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెప్పి ఇప్పుడు అక్రమంగా తనను అరెస్టు చేశారని అంటున్నారు ఎమ్మెల్సీ కవిత.

ఈడీపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
X

దర్యాప్తు సంస్థ ఈడీపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీం కోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి విచారణ జరుగుతుండగానే, అదే కేసులో తనను అరెస్టు చేశారని ఆమె ప్రస్తావించారు. తనను అరెస్ట్ చేయబోమంటూ గతంలో సుప్రీంకోర్టుకి ఈడీ అధికారులు తెలిపారని, సర్వోన్నత న్యాయస్థానానికి మాటిచ్చి తప్పారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని అన్నారు కవిత. ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అక్రమ అరెస్ట్..

గతంలో విచారణ సందర్భంగా అరెస్ట్ కోసం సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెప్పి ఇప్పుడు అక్రమంగా తనను అరెస్టు చేశారని అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. తన అరెస్ట్ అక్రమం అని, వెంటనే విడుదల చేసేలా ఈడీని ఆదేశిస్తూ, అదే సమయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. కవిత తరఫు న్యాయవాది మోహిత్‌ రావు.. ఆన్ లైన్ ద్వారా సుప్రీంకోర్టుకు ఈ పిటిషన్ సమర్పించారు.

వారం రోజుల కస్టడీ..

శుక్రవారం ఈడీ అధికారులు హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేశారు, అదే రోజు ఢిల్లీకి తరలించారు. శనివారం ఢిల్లీలోని రౌస్అ వెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరిచారు. ఈనెల 23 వరకు కవితను విచారించడానికి వీలుగా ఈడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని పలు ప్రశ్నలు అడుగుతున్నారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని అధికారులు వీడియో రూపంలో రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  18 March 2024 12:08 PM GMT
Next Story