Telugu Global
Telangana

మహిళా రిజర్వేషన్ల కోసం మరో పోరాటం..

ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని, సుప్రీంలో విచారణ జరుగుతోందని చెప్పారు కవిత. కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ లో భారత్ జాగృతి తరపున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు.

మహిళా రిజర్వేషన్ల కోసం మరో పోరాటం..
X

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకోసం ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. అదే సమయంలో పార్లమెంట్ చేసిన చట్టం పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది అని కూడా ఆమె కామెంట్లు చేశారు. అయితే ఆ చట్టం వచ్చే ఏడాది నుంచి అమలులోకి వచ్చేందుకు తాను మరో పోరాటం మొదలు పెట్టబోతున్నట్టు తెలిపారామె. మహిళా రిజర్వేషన్ల అమలుకోసం ఈ పోరాటం ప్రారంభిస్తాన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

దేశంలో మహిళా రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల నుంచే అమలు చేయాలనే డిమాండ్‌ తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు కవిత. అయితే అది చట్టంగా మారిన తర్వాత, కేంద్రం అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారామె. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్లు చట్ట రూపంలోకి వచ్చినా, జనగణన, నియోజక వర్గాల పునర్విభజన అంటూ కేంద్రం తాత్సారం చేస్తోంది. అంటే ఈ రిజర్వేషన్లు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలయ్యే ఛాన్స్ లు లేవనే చెప్పాలి. ఇదే విషయంపై న్యాయపోరాటం చేస్తామంటున్నారు కవిత. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని, సుప్రీంలో విచారణ జరుగుతోందని చెప్పారు కవిత. కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ లో భారత్ జాగృతి తరపున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు.

First Published:  5 Nov 2023 7:44 AM GMT
Next Story