Telugu Global
Telangana

కేసీఆర్ మేనిఫెస్టో అంటే ఇచ్చే పైసలు పెంచుడు.. సిలిండర్ ధర తగ్గించుడు

అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిననాడు తాము ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నామని అన్నారు.

కేసీఆర్ మేనిఫెస్టో అంటే ఇచ్చే పైసలు పెంచుడు.. సిలిండర్ ధర తగ్గించుడు
X

రాష్ట్రంలో మరో సారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు రూ.5 వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికలు పూర్తయిన వెంటనే పెన్షన్ రూ.3 వేలకు పెరుగుతుందని, ఆ తర్వాత ఏటేటా పెరుగుతూ ఐదేళ్లకు రూ.5 వేలకు చేరుతుందని వివరించారు. కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు రూ. 3 వేల ఆర్థిక సాయం చేయబోతున్నామని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ ని రూ.400కే అందిస్తామన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, మొత్తం కార్డులు కోటి అవుతాయని అన్నారు. కేసీఆర్ మేనిఫెస్టో అంటే పైసలు ఇచ్చేటివి పెంచుడు, సిలిండర్ ధర తగ్గించుడు అని పేర్కొన్నారు కవిత. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా ఆమె ప్రచారం చేపట్టారు. మహిళల సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్‌ ది పేగు బంధమని చెప్పారు కవిత. కాంగ్రెస్‌ పార్టీది అధికారం కోసం అర్రులు చాచే అహంకారమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కు పెట్టే గుణం లేదని, ఆ పార్టీ నేతల్లో కేవలం అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. ఎన్నికలు రాగానే.. ఇతర పార్టీల వాళ్లు అదిస్తాం, ఇదిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతుంటారని, ఇచ్చిన హామీలను వారెవరూ నిలబెట్టుకోలేరని అన్నారు కవిత.

కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు కవిత. 55 ఏళ్ల అధికారంలో కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.200 అని గుర్తు చేశారు. రైతులకు పైసా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పాలనలో పెన్షన్ పెరిగిందని, రైతులకు రైతు బంధు చేతికి అంది వచ్చిందని, రైతుబీమాతో బాధిత కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకోకుండా నిలబడగలుగుతున్నాయని వివరించారు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిననాడు తాము ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నామని అన్నారు ఎమ్మెల్సీ కవిత.

First Published:  19 Nov 2023 11:30 AM GMT
Next Story