Telugu Global
Telangana

ప్రజలను కలవరు.. ఢిల్లీలోనే రేవంత్ దర్శనం

ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ జీవో-3 తీసుకువచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు కవిత.

ప్రజలను కలవరు.. ఢిల్లీలోనే రేవంత్ దర్శనం
X

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ ప్రజల్ని కలవడంలేదని రేవంత్ రెడ్డి విమర్శించేవారని, మరిప్పుడు ఆయన ఏం చేస్తున్నారని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ప్రజలకు ఆయన ఎందుకు కనపడటం లేదన్నారు. ఆయన ఢిల్లీ నేతలను మాత్రమే కలుస్తారని, తెలంగాణ ప్రజల్ని కలవరని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్, రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు కవిత.


మహిళా రిజర్వేషన్లకోసం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా జరిగింది. భారత్ జాగృతి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవో-3 వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో-3 వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే రిజర్వేషన్ లభిస్తోందన్నారు.

ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కానీ, జీవో-3 తీసుకువచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు కవిత. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ హయాంలో పోలీస్ శాఖ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారామె. కానీ ఆ 33 శాతం రిజర్వేషన్లకు జీవో-3 వల్ల గండిపడిందన్నారు. 33 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లు కాస్తా 12శాతానికి పడిపోయాయని మహిళా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పారు. మహిళా దినోత్సవం రోజయినా మహిళలకు న్యాయం చేసే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు కవిత.

First Published:  8 March 2024 7:53 AM GMT
Next Story