Telugu Global
Telangana

ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి కవిత సవాల్..

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేసినా.. తాము ఈ ఎన్నికల్లో ఓటు అడగబోమని చెప్పారు.

ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి కవిత సవాల్..
X

తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ హయాంలో నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ సక్రమంగా సమకూరాయని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. నియామకాల విషయంలో యువతలో లేనిపోని అనుమానాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రానికి కూడా ఆ విషయంలో తెలంగాణ తీసిపోలేదని క్లారిటీ ఇచ్చారు కవిత.


కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేసినా.. తాము ఈ ఎన్నికల్లో ఓటు అడగబోమని చెప్పారు. రుజువు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా కవిత రోడ్ షోలు నిర్వహించారు. తెలంగాణలో జరిగిన నియామకాల గురించి ఆమె వివరించారు.

ప్రభుత్వ రంగంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.6 లక్షల మంది ఇప్పటికే ఉద్యోగాల్లో చేరారని వివరించారు ఎమ్మెల్సీ కవిత. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను తెర్లుకానివ్వవద్దని ప్రజల్ని కోరారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదని, సకాలంలో ఎరువులను సరఫరా చేయలేదని, వడ్లు కొనుగోలు చేయలేదని విమర్శించారు. ఎన్నికలకు ముందే రైతుబంధుని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు.. పొరపాటున అధికారంలోకి వస్తే రైతు బంధుకు రాంరాం చెబుతారని ఎద్దేవా చేశారు. రాబోయే ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు కవిత. సీఎం కేసీఆర్ మాటంటే మాటేనని, చెప్పినవన్నీ చేసి చూపించారన్నారు కవిత. హ్యాట్రిక్ సీఎంగా ఆయన దక్షిణాదిన రికార్డ్ సృష్టించబోతున్నట్టు తెలిపారు.

First Published:  27 Nov 2023 1:34 PM GMT
Next Story