Telugu Global
Telangana

సాంస్కృతిక ఉద్యమానికి నాంది పలకాల్సిన సందర్భం ఇది - ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే దిశగా ఢిల్లీలో కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.

సాంస్కృతిక ఉద్యమానికి నాంది పలకాల్సిన సందర్భం ఇది - ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణ ప్రజలు మరో సాంస్కృతిక ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. విభిన్న సంస్కృతులకు నెలవైన విశాల భారతదేశంలో అన్ని సంస్కృతులు, భాషలు, మతాలు కలిసి పురోగమించాయని అన్నారామె. కానీ ఇప్పుడు ఆ సంస్కృతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ క్రీడలను ప్రజాస్వామికవాదులు తిప్పికొట్టాలని కోరారు కవిత.

గంగా జమున తెహజీబ్..

విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని అన్నారు కవిత. సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని, ఈ రాష్ట్రంలోని అందరి సమష్టి సంఘర్షణ వల్లే తెలంగాణ సాధ్యమైందని వివరించారు కవిత. ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే దిశగా ఢిల్లీలో కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చుకుంటున్న తరుణంలో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే నీచ సంస్కృతికి కొందరు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి..

ఆనాటి నుంచి ఈనాటి వరకు ఢిల్లీ పాలకులపై తిరగబడ్డ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గడ్డ తెలంగాణ అని అన్నారు కవిత. ఢిల్లీ పీఠానికి పదేపదే తన అస్తిత్వాన్ని చాటిన పౌరుషాల గడ్డ ఇదని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బలమైన గొంతు వినిపించే నాయకత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని, స్థానిక నాయకత్వంపై బురదజల్లడం, ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి వారి దృష్టిని అభివృద్ధి నుంచి మరల్చడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రలను ఛేదించి తెలంగాణ అస్తిత్వాన్ని చూపెడతారని, ఇక్కడి గంగా జమునా తెహజీబ్‌ను కాపాడతారని స్పష్టం చేశారు కవిత.

కవితకు సంఘీభావం..

కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడికి ప్రయత్నించిన ఘటనను తప్పుబట్టారు టీఆర్ఎస్ నేతలు. కవితను కలవడానికి వచ్చిన నేతలు ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారు. కేంద్రం అరాచకాలను ప్రశ్నిస్తున్నారు.

First Published:  27 Aug 2022 6:46 AM GMT
Next Story