Telugu Global
Telangana

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో 8మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
X

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు ప్రకటించారు. ఆమెను ఈరోజు రాత్రి ఢిల్లీకి తరలిస్తారని సమాచారం. కవిత ఫోన్లు, ఆమె పర్సనల్ అసిస్టెంట్ ఫోన్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. అరెస్ట్‌కు ముందు ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేశారు. చివరకు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.


మధ్యాహ్నం నుంచి సోదాలు..

బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో 8మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. సోదాలు జరిగే సమయంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈడీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు.. అరెస్టులు ఏంటని లీగల్ సెల్ ప్రతినిధులు ప్రశ్నించారు. న్యాయపోరాటం చేస్తామన్నారు.

కవిత అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆమె నివాసం వద్దకు వచ్చారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోందని, రాజకీయంగా కేసీఆర్‌, బీఆర్ఎస్ ని బలి చేసేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన. ప్రజాక్షేత్రంలో రాజకీయంగానే ఎదుర్కొంటూనే, చట్ట పరంగా న్యాయస్థానాల్లో పోరాడతామన్నారు ప్రశాంత్ రెడ్డి.

First Published:  15 March 2024 1:19 PM GMT
Next Story