Telugu Global
Telangana

ఆ పార్టీ ఒక 'తేలు'.. దాన్ని నమ్మి అధికారం ఇస్తే..!

మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని ప్రకటించారు కవిత.

ఆ పార్టీ ఒక తేలు.. దాన్ని నమ్మి అధికారం ఇస్తే..!
X

కాంగ్రెస్ పార్టీ ఒక తేలు వంటిదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ ఇప్పుడు కొత్త పల్లవి మొదలు పెట్టిందని, గతంలో 10 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ నేతలు ఏం చేశారని నిలదీశారామె. నిజామాబాద్‌ జిల్లా నందిపేట్ మండలంలో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. మున్నూరు కాపులు బీఆర్ఎస్ కి అండగా నిలబడాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటికీ ప్రజల గురించి ఆలోచించవని విమర్శించారు.


కర్నాటకలో అధికారంలోకి వచ్చి 3నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేయలేదని విమర్శించారు కవిత. కర్నాటకలో పెన్షన్లు, కరెంటు సరిగా ఇవ్వడం లేదన్నారు. కర్నాటక ప్రజల్ని మోసం చేసినట్టే, ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేసేందుకు కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అంటూ వస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీల కొత్త కథలు నమ్మి మోసపోదామా, లేక చెప్పినవన్నీ చెప్పినట్టు చేస్తున్న బీఆర్ఎస్ ని మరోసారి నమ్ముదామా అని ప్రశ్నించారు కవిత.

మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని ప్రకటించారు కవిత. ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతో రూ.1200 గా ఉన్న గ్యాస్ సిలిండర్ ను రూ. 400 కే సబ్సిడీ కింద ఇస్తామని చెప్పారు. నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు కవిత.

First Published:  17 Nov 2023 1:52 PM GMT
Next Story