Telugu Global
Telangana

తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీచేసి గెలుస్తా.. కానీ..

పార్టీ అధ్యక్షుడు ఎక్కడినుండి పోటీ చేయమంటే అక్కడినుండి పోటీ చేస్తా అన్నారు. తెలంగాణలో ఎక్కడినుంచి పోటీ చేసినా, స్వాగతించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీచేసి గెలుస్తా.. కానీ..
X

100 రోజుల తర్వాత కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మీడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆమె.. సీఎం రేవంత్‌, చంద్రబాబు టార్గెట్‌గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతులు వెలిగించడానికి రేవంత్‌ సిద్ధంగా ఉన్నారన్నారు కవిత. అక్కడి నుంచి ఫోన్ వచ్చినట్టుంది అంటూ పరోక్షంగా చంద్రబాబు గురించిన ప్రస్తావన చేశారు. తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం వెనకాల రియల్ ఎస్టేట్ దందా ఉందని ఆరోపించారు.

పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించాకే తాము ప్రకటిస్తామన్నారు కవిత. అలాగే తన పోటీపైనా ఓ క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు ఎక్కడినుండి పోటీ చేయమంటే అక్కడినుండి పోటీ చేస్తా అన్నారు. తెలంగాణలో ఎక్కడినుంచి పోటీ చేసినా, స్వాగతించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరు అని ప్రచారం జరుగుతున్న వేళ కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎంపీగా పోటీ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు కవిత వ్యాఖ్యల్ని బట్టి అర్థం అవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతకుముందు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కవిత.. హామీల అమలుకు ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు."ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ పదవీ లేని ప్రియాంకను ఎలా పిలుస్తారు..? ఆమెను పిలిస్తే నిరసన తెలుపుతాం. జార్ఖండ్‌ ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఖర్చుతో హైదరాబాద్‌ తరలించారు. రోజూ ప్రజలను కలుస్తానని సీఎం అన్నారు. ఒక్క రోజే ప్రజలను కలిశారు. ప్రజాదర్బార్‌ అన్నారు.. అక్కడికి వెళ్లడం లేదు. యూటర్న్‌ సీఎం అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు" అని కవిత విమర్శలు గుప్పించారు.

First Published:  3 Feb 2024 12:47 PM GMT
Next Story