Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర‌ కేసు... కేరళలో సోదాలు పూర్తి, హైదరాబాద్ చేరుకున్న సిట్ అధికారులు

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహారంలో తుషార్ పాత్రను వెలికి తీయడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కేరళ వెళ్ళారు. అక్కడ పలు, ఇళ్ళు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి తిరిగి ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర‌ కేసు... కేరళలో సోదాలు పూర్తి, హైదరాబాద్ చేరుకున్న సిట్ అధికారులు
X

టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి పలువురు కుట్ర చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఇందులో ప్రత్యక్ష భాగస్వాములైన రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ముగ్గురు నిందితులే కాకుండా ఈ కుట్రలో మరి కొంత మందికి భాగస్వామ్యముందని భావిస్తున్న సిట్ అధికారులు ఆ దిశగా సాక్ష్యాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొయినా బాద్ ఫార్మ్ హౌజ్ లో ఎమ్మెల్యేలతో మాట్లాడిన సందర్భంలో రామచంద్ర భారతి, తుషార్ అనే ఓ బీజేపీ నాయకుడితో ఫోన్లో సంప్రదింపులు జరిపిన విషయం వీడియోల్లో బహిర్గతమైంది. కేరళకు చెందిన తుషార్ వ్యవ‌హారాన్ని తేల్చేందుకు నల్గొండ ఎస్పీ రేమా రాజేశ్వరి అద్వర్యంలో ఓ బృందం కేరళ వెళ్ళింది. కేరళలో తుషార్‌తో పాటు, మరో అనుమానితుడు వైద్యుడైన జగ్గుస్వామి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు వైద్యుడు జగ్గుస్వామికి నోటీసులు అందజేశారు. కొచ్చిలో ఉంటున్న ఆయన కార్యాలయంలో సిట్ అధికారులు ఈ నోటీసులు అందించారు. ఇంతకు ముందే తుషార్ కు, కరీంనగర్ కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ లకు కూడా సిట్ నోటీసులను జారీ చేసింది. వారిని కూడా 21న సిట్ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంది. న్యాయవాది శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ముఖ్య అనుచరుడనే ఆరోపణలున్నాయి.

కాగా కేరళలో సోదాలు, దర్యాపునుముగించుకున్న సిట్ అధికారులు ఈ రోజు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీకి చెందిన మరికొంత మందిని కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

First Published:  18 Nov 2022 5:36 AM GMT
Next Story