Telugu Global
Telangana

సీఎం రేవంత్ ని కలవడంపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తాజాగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తన కుటుంబ సభ్యులతో సహా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పుకార్లపై ఆయన మరోసారి స్పందించారు.

సీఎం రేవంత్ ని కలవడంపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గురించి పుకార్లు షికార్లు చేశాయి. ఆయన రేవంత్ రెడ్డిని కలిశారని, పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే పాత ఫొటోలు చూపిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆ వార్తలను ఖండించారు. అక్కడ సీన్ కట్ చేస్తే తాజాగా ఎమ్మెల్యే తెల్లం కుటుంబంతో సహా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈసారి కూడా వెంకట్రావు రాజకీయ వ్యాఖ్యలకు చెక్ పెట్టారు. భద్రాచలం అభివృద్ధికోసమే తాను సీఎంను కలిశానంటున్నారు.

తెల్లం వెంకట్రావు, మంత్రి పొంగులేటికి సన్నిహితుడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొంగులేటితోపాటు ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారు. అయితే భద్రాచలం టికెట్ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు కాంగ్రెస్ కేటాయించింది. దీంతో తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అక్కడ టికెట్ సాధించి పొదెం వీరయ్యపై గెలిచారు. గెలిచిన తర్వాత తిరిగి ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తన కుటుంబ సభ్యులతో సహా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.

ఎందుకు కలిశానంటే..?

పార్టీ మార్పు వార్తల్ని మరోసారి ఖండించారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎంని కలిశానన్నారు. భద్రాచలం రామాలయం అభివృద్ధిపై ఆయనతో చర్చించానన్నారు. ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని సీఎంను కోరినట్లు తెలిపారు. భద్రాచలం పట్టణంలోని రెండు వార్డులు ఆంధ్రాలో ఉన్నాయని, దాని వల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం పడుతోందన్నారు. ఆయా విషయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు ఎమ్మెల్యే తెల్లం. మరి ఆయన వివరణలో నిజమెంతుందో ముందు ముందు తేలిపోతుంది.

First Published:  3 March 2024 7:50 AM GMT
Next Story