Telugu Global
Telangana

రఘునందన్ సైలెన్స్.. దుబ్బాకపైనే ఫోకస్

కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న రఘునందన్ .. మళ్లీ ఇప్పుడు దుబ్బాక అభివృద్ధి కోసం అంటూ ప్రెస్ మీట్ పెట్టారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

రఘునందన్ సైలెన్స్.. దుబ్బాకపైనే ఫోకస్
X

ఆమధ్య తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి తాను కూడా అర్హుడినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, అధిష్టానం పెద్దలపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. మీడియా చిట్ చాట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో అధిష్టానం కాస్త గట్టిగానే తలంటినట్టుంది. అందుకే ఆతర్వాత పెద్దగా హైలెట్ కాలేదు రఘునందన్. మోదీ సభలో కూడా పరిమితంగానే వ్యవహరించారు. దుబ్బాకపైనే ప్రస్తుతం రఘునందన్ ఫోకస్ పెట్టారు.

పువ్వు గుర్తువల్ల తాను గెలవలేదని, తన సొంత ఇమేజ్ తో దుబ్బాకలో విజయం సాధించానని, మునుగోడులో డబ్బులు కుమ్మరించినా పార్టీ గెలవలేకపోయిందని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్. ఓ దశలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన బయటపడలేదు. కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న ఆయన.. మళ్లీ ఇప్పుడు దుబ్బాక అభివృద్ధి కోసం అంటూ ప్రెస్ మీట్ పెట్టారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల ఎల్డీఎఫ్ నిధులు మంజూరు చేయాలన్నారు రఘునందన్ రావు. సిద్దిపేట, సిరిసిల్ల పట్టణాల అభివృద్ధి తరహాలో దుబ్బాక అభివృద్ధికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొన్ని అదృశ్య శక్తులు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని అన్నారు. 2016 జనవరిలో సీఎం కేసీఆర్ దుబ్బాక పర్యటనలో అనేక హామీలిచ్చారని, వాటిలో కొన్ని కార్యరూపం దాల్చినా, మరికొన్ని అమలుకి నోచుకోలేదని గుర్తు చేశారు రఘునందన్ రావు. దుబ్బాక అభివృద్ధికి మంత్రులు, సీఎం సహకరించాలన్నారు. రాష్ట్ర పార్టీపై పెత్తనం కోసం ఎదురు చూసిన రఘునందన్ రావు, అది సాధ్యం కాదని తేలిపోయే సరికి సొంత నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.

First Published:  16 July 2023 4:34 AM GMT
Next Story