Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలుకేసు: ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళిన రోహిత్ రెడ్డి

సీబీఐ, ఈడీ, ఐటీ తో సహా ఇంకెన్ని సంస్థలతో తమ మీద దాడులు చేయించినా తాము వెనక్కి తగ్గబోమని, బీజేపీపై తమ‌ పోరాటం ఆపబోమని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ లు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని , బీజేపీని వ్యతిరేకించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు రోహిత్ రెడ్డి.

ఎమ్మెల్యేల కొనుగోలుకేసు: ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళిన రోహిత్ రెడ్డి
X

ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో ఈడీ రంగంలోకి దిగి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ని విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈడీకి ఏ మాత్రం సంబంధం లేని ఈ కేసులో ఈడీ జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఈ రోజు రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ ధాఖ‌లు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోహిత్ రెడ్డి, సిట్ విచారిస్తున్న కేసును సీబీఐ కి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై స్పందిస్తూ బీజేపీ నాయకులు కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులతో తమకు సంబంధం లేదని ప్రకటించిన బీజేపీ నేతలు ఇప్పుడువారిని రక్షించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఏ సంబంధం లేకపోతే విచారణకు ఎందుకు హాజరవడంలేదని ప్రశ్నించారు రోహిత్ రెడ్డి.

సీబీఐ, ఈడీ, ఐటీ తో సహా ఇంకెన్ని సంస్థలతో తమ మీద దాడులు చేయించినా తాము వెనక్కి తగ్గబోమని, బీజేపీపై తమ‌ పోరాటం ఆపబోమని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ లు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని , బీజేపీని వ్యతిరేకించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు రోహిత్ రెడ్డి.

న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కోర్టులు ఏ తీర్పులు ఇచ్చినా కట్టుబడి ఉంటామన్నారాయన. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ కి అప్పగించాలన్న హైకోర్టు తీర్పుకు సంబంధించి ఆర్డర్ కాపీ వచ్చాక దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామన్నారు.

First Published:  26 Dec 2022 2:06 PM GMT
Next Story