Telugu Global
Telangana

BRS వద్దు.. TRS ముద్దు.. మళ్లీ పార్టీ పేరు మార్పు..!

పార్టీకి బలమైన తెలంగాణ సెంటిమెంటును దూరం చేసుకోవద్దని కడియం సూచించినట్లు సమాచారం. మెజార్టీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

BRS వద్దు.. TRS ముద్దు.. మళ్లీ పార్టీ పేరు మార్పు..!
X

ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో.. భారత రాష్ట్ర సమితి పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. కొన్ని రోజులుగా లోక్‌సభ ఎన్నికల కోసం BRS పార్లమెంటరీ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో అన్ని జిల్లాల నుంచి వచ్చిన నేతలు.. ఇదే అంశాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు వినిపిస్తూనే.. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం.

బుధవారం వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనూ బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాలన్న అంశంపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తెలంగాణ పార్టీగా ప్రజల్లో మనకు బలమైన గుర్తింపు ఉందని.. తెలంగాణను తొలగించి.. భారత్‌ను చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ఎఫెక్ట్ పడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. కనీసం ఒకటి, రెండు శాతం మందిలో అలాంటి భావన ఏర్పడినా.. ఆ మేరకు ఓట్లు దూరమయ్యే అవకాశాలున్నాయని కడియం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత అంతగా కలిసి రాలేదన్న భావన పార్టీ వర్గాల్లోనూ ఉందని కడియం చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీకి బలమైన తెలంగాణ సెంటిమెంటును దూరం చేసుకోవద్దని కడియం సూచించినట్లు సమాచారం. మెజార్టీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఇతర రాష్ట్రాల్లో భారత రాష్ట్ర సమితిగా ఉంచి.. రాష్ట్ర రాజకీయాలకు టీఆర్ఎస్‌ను తెరమీదకు తీసుకోచ్చే అంశాన్ని ఆలోచించాలని చెప్పారు కడియం. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే మాజీ ఎంపీ వినోద్‌కుమార్ లాంటి వాళ్లు ఈ విషయంలో నిపుణులతో చర్చించాలని కడియం సూచించారు. గులాబీబాస్‌ కేసీఆర్ దృష్టికి సైతం ఈ అంశాన్ని తీసుకెళ్లలాని కడియం శ్రీహరి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

First Published:  11 Jan 2024 5:52 AM GMT
Next Story