Telugu Global
Telangana

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి.. నిధులు విడుదల

మీర్‌ ఆలం చెరువు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేసినందుకు రేవంత్ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి.. నిధులు విడుదల
X

హైదరాబాద్‌కు మరో కేబుల్‌ బ్రిడ్జ్‌ రానుంది. పాతబస్తీలోని మీర్ ఆలం చెరువుపై ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. చింతల్‌మెట్‌, బెంగళూరు నేషనల్ హైవేను కలుపుతూ నాలుగు లైన్ల వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన మొత్తం 2 కిలోమీటర్ల 650 మీటర్లు ఉండనుంది. తాజాగా ఈ వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల కోసం ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది.

ఈ వంతెన నిర్మాణం కోసం మొత్తం రూ. 363 కోట్ల 53 లక్షలు ఖర్చు చేయనున్నారు. మీర్‌ ఆలం చెరువు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేసినందుకు రేవంత్ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. పాతబస్తీ వాసులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ట్రాఫిక్ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని, ఈ బ్రిడ్జి కోసం తాను ఎప్పటి నుంచో పోరాడుతున్నానని చెప్పారు అసదుద్దీన్.

మీర్ ఆలం చెరువుపై రూ.220 కోట్ల వ్యయంతో కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించాలని 2021లో గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్‌కు సంబంధించి HMDA కసరత్తు చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు సైతం ఆహ్వానించింది. ఆర్వీ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అయితే నిధులు విడుదల కాకపోవడంతో అప్పుడు పనులు ముందుకు సాగలేదు. తాజాగా ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేసింది.

ప్రస్తుతం దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి ఐకానిక్ స్పాట్‌గా ఉంది. ఈ వంతెనను 2020 సెప్టెంబర్‌లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 800 మీటర్ల పొడవున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కోసం రూ. 184 కోట్లు ఖర్చు చేశారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జితో పోలిస్తే మీర్ ఆలం చెరువు కేబుల్ బ్రిడ్జి మరింత పెద్దగా ఉండనుంది.

First Published:  11 March 2024 2:57 PM GMT
Next Story