Telugu Global
Telangana

హైద‌రాబాద్‌లో ప‌ట్ట‌ప‌గ‌లు దారుణం.. - బాలిక‌పై సామూహిక అత్యాచారం

సోమవారం ఉద‌యం బాధిత బాలిక త‌న సోద‌రుడు, మ‌రో ముగ్గురు చిన్నారుల‌తో క‌ల‌సి ఇంట్లో ఉండ‌గా, గంజాయి మ‌త్తులో ఉన్న 8 మంది నిందితులు ఒక్క‌సారిగా వారి ఇంట్లోకి ప్ర‌వేశించారు.

హైద‌రాబాద్‌లో ప‌ట్ట‌ప‌గ‌లు దారుణం.. - బాలిక‌పై సామూహిక అత్యాచారం
X

హైద‌రాబాద్‌లో ప‌ట్ట‌ప‌గ‌లు దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక‌పై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. గంజాయి మ‌త్తులో ఉన్న 8 మంది సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో ఏకంగా ఇంట్లోకి చొర‌బ‌డి మిగిలిన పిల్ల‌లు కూడా ఉండ‌గానే.. బాలికను భ‌వ‌నం మూడో అంత‌స్తుకు లాక్కెళ్లి ఈ దారుణానికి తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

హైద‌రాబాద్ లాల్‌బ‌జార్‌కు చెందిన బాలిక (16) త‌ల్లిదండ్రులిద్ద‌రూ గ‌తంలో చ‌నిపోయారు. దీంతో ఆ బాలిక 15 రోజుల క్రితం త‌న త‌మ్ముడి (14)తో క‌ల‌సి మీర్‌పేటలోని ఒక కాల‌నీకి వ‌చ్చింది. స‌మీప బంధువైన అక్క వ‌ద్ద ఆశ్ర‌యం పొందుతోంది. అలాగే దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ దుస్తుల దుకాణంలో ఆ బాలిక ప‌నిచేస్తోంది. ఆమె త‌మ్ముడు ఫ్లెక్సీలు క‌ట్టే ప‌నిలో కుదిరాడు.

సోమవారం ఉద‌యం బాధిత బాలిక త‌న సోద‌రుడు, మ‌రో ముగ్గురు చిన్నారుల‌తో క‌ల‌సి ఇంట్లో ఉండ‌గా, గంజాయి మ‌త్తులో ఉన్న 8 మంది నిందితులు ఒక్క‌సారిగా వారి ఇంట్లోకి ప్ర‌వేశించారు. వారిలో న‌లుగురు బాలిక మెడ‌పై క‌త్తి పెట్టి బెదిరించి ఆమెను అదే భ‌వ‌నం మూడో అంత‌స్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితో పాటు అక్కడే ఉన్న చిన్నారుల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌కుండా బెదిరిస్తూ ఉన్నారు.

పైకి లాక్కెళ్లిన బాలిక‌పై నిందితుల్లో ముగ్గురు క‌త్తి చూపించి బెదిరిస్తూ అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలో బాలిక గ‌ట్టిగా అర‌వ‌డంతో చుట్టుప‌క్క‌ల వారు వ‌స్తార‌నే భ‌యంతో నిందితులు అక్క‌డినుంచి ప‌రార‌య్యారు. స‌మాచారం అందుకున్న బాధితురాలి అక్క మీర్‌పేట పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలిక‌ను వైద్య‌ప‌రీక్ష‌ల కోసం స‌ఖి కేంద్రానికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.

నిందితులు తెలిసిన వ్య‌క్తులే..

బాలిక‌పై అఘాయిత్యానికి తెగ‌బ‌డిన నిందితుల్లో న‌లుగురు తెలిసిన వ్య‌క్తులే కావ‌డం గ‌మ‌నార్హం. బాలిక నివాసం ఉండే భ‌వ‌నంలోని కింది అంత‌స్తులో ఉండే టైస‌న్‌, మంగ‌ళ్‌హాట్‌కు చెందిన రౌడీషీట‌ర్ అబేద్ లాలా నిందితుల్లో ఉన్న‌ట్టు బాధితురాలి త‌మ్ముడు చెప్పాడు. మ‌రో ఇద్ద‌రు నిందితులు కూడా త‌మ నివాసానికి సమీపంలోనే ఉంటారని పోలీసులకు తెలియ‌జేశాడు. ఈ క్ర‌మంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఏడు ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. ఇదిలావుంటే.. నిందితుల్లో మ‌రో న‌లుగురు పోలీసుల అదుపులో ఉన్నార‌ని తెలుస్తోంది.

*

First Published:  22 Aug 2023 5:30 AM GMT
Next Story