Telugu Global
Telangana

కాళేశ్వరంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌

రీడిజైనింగ్ ద్వారా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం, దాంతో కలిగిన లాభనష్టాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, అన్నారం బ్యారేజీ దగ్గర సీపేజీ సమస్యలు సహా అన్ని అంశాలపై మంత్రులు వివరిస్తారని తెలుస్తోంది.

కాళేశ్వరంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌
X

తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ వార్ నడుస్తోంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయగా.. అందుకు కౌంటర్‌గా బీఆర్ఎస్ `స్వేద`పత్రం పేరుతో పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు అధికారపక్షం కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు రెడీ అయింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించనున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లి దగ్గర కుంగిన మేడిగడ్డ ఆనకట్టతో పాటు కాళేశ్వరం ఆనకట్టకు సంబంధించిన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. మంత్రుల వెంట ఈఎన్సీ మురళీధర్‌ కూడా ఉంటారు.

రీడిజైనింగ్ ద్వారా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం, దాంతో కలిగిన లాభనష్టాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, అన్నారం బ్యారేజీ దగ్గర సీపేజీ సమస్యలు సహా అన్ని అంశాలపై మంత్రులు వివరిస్తారని తెలుస్తోంది. ప్రాణహిత కోసం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పనులు, వ్యయం, వాటి వినియోగం లాంటి అంశాలను ప్రస్తావించనున్నారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్ట సమస్యలు వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ఈ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌పై బీఆర్ఎస్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

First Published:  29 Dec 2023 5:49 AM GMT
Next Story