Telugu Global
Telangana

ఇవాళ జ్వరం, రేపు దాడులు.. ఈ డ్రామాలు ఊహించినవే..

కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ పూర్తిగా పోయిందని, మునుగోడు ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీల సానుభూతి డ్రామాలు నమ్మొద్దని చెప్పారు తలసాని. ఆ డ్రామాలు నమ్మితే నష్టపోతారని హెచ్చరించారు.

ఇవాళ జ్వరం, రేపు దాడులు.. ఈ డ్రామాలు ఊహించినవే..
X

ఓటమి ఖాయమైపోయిందని తేలాక బీజేపీ చిట్టచివరి ప్రయత్నంగా డ్రామాలు మొదలు పెడుతుందని తాను మూడు రోజుల క్రితం చెప్పానని, నేడు అదే నిజమైందని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజగోపాల్ రెడ్డి జ్వరం కారణంగా మునుగోడు ప్రచారానికి దూరంగా ఉన్నారన్న వార్తలపై ఆయన స్పందించారు. మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు ఇలాగే ఉంటాయన్నారాయన.

జ్వరం, ఆ తర్వాత దాడులు..

ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సానుభూతి కోసం చేతికి పట్టీలు కట్టుకుంటారని, ఆ తర్వాత జ్వరం వచ్చిందని చెబుతారని, ఆ మరునాడు దాడులు చేశారంటూ ఏడుస్తారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఇలాగే జరిగిందని, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని తెలిపారు తలసాని. ప్రతిపక్షాల అభ్యర్థులు వాళ్లపై వాళ్లే దాడులు చేయించుకుని ఏడుస్తారని మంత్రి ఆరోపించారు. తాము కాంట్రాక్టుల కోసం రాజకీయం చేసే వాళ్ళం కాదని, కుట్రలు, కుతంత్రాలు తమకు అవసరం లేదని చెప్పారు.

ఆ డ్రామాలు నమ్మితే నష్టం..

కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ పూర్తిగా పోయిందని, మునుగోడు ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీల సానుభూతి డ్రామాలు నమ్మొద్దని చెప్పారు తలసాని. ఆ డ్రామాలు నమ్మితే నష్టపోతారని హెచ్చరించారు. వచ్చే సాధారణ ఎన్నికల లోపు మునుగోడు అభివృద్ధిలో మార్పు చూపించకపోతే అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా మునుగోడులో టీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. మునుగోడులో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కూడా అన్ని పథకాలు అందాయని చెప్పారు.

First Published:  25 Oct 2022 12:54 PM GMT
Next Story