Telugu Global
Telangana

జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ.. - మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్

జూన్ 5వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులతో గొర్రెల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు.

జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ.. - మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్
X

జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు.

జూన్ 5వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులతో గొర్రెల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, పశుసంవర్థక శాఖ అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి గొర్రెలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

కొనుగోలు చేసేందుకు ఐదుగురు అధికారులతో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. 4,620 యూనిట్లకు పంపిణీ చేయడానికి 97,020 గొర్రెలు అవసరం కాగా, వీటిల్లో ఒక్కో యూనిట్‌కు 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలును గొల్లకుర్మలకు అందిస్తారు. వీటికయ్యే మొత్తం వ్యయం రూ.80.85 కోట్లు కాగా, అందులో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది.

First Published:  23 May 2023 1:50 PM GMT
Next Story