Telugu Global
Telangana

క్రికెటర్లు త్రిష, యశశ్రీకి స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో గొంగడి త్రిష అద్బుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టుకు విజయాన్ని అందించింది.

క్రికెటర్లు త్రిష, యశశ్రీకి స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

ఐసీసీ ప్రారంభించిన మొట్టమొదటి అండర్-19 వుమెన్స్ వరల్డ్ కప్‌ను టీమ్ ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. భారత యువ జట్టును బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియా-న్యూజీలాండ్ టీ20 మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సన్మానించింది. స్వయంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ బాలికలకు అభినందనలు తెలియజేసి జట్టుకు రూ.5 కోట్ల చెక్‌ను అందించారు. అయితే, బాలికల టీమ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష ఉన్నది.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో గొంగడి త్రిష అద్బుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టుకు విజయాన్ని అందించింది. ఇవాళ త్రిషతో పాటు మరో క్రికెటర్ యశశ్రీకి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ క్రీడా, యువజన సర్వీసుల శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. యువ క్రికెటర్లతో పాటు ఫిట్‌నెస్ ట్రైనర్ శాలినికి పుష్ఫ గుచ్చం అందించి శాలువాలతో సన్మానించారు. దేశం వరల్డ్ కప్ గెలుచుకోవడంలో తెలంగాణ బిడ్డల పాత్ర కూడా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు.

తమ బిడ్డలను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారి తల్లిదండ్రులను కూడా మంత్రి సత్కరించడం గమనార్హం. యువ క్రికెటర్లు వస్తున్నారని తెలుసుకొని క్రీడాభిమానులు వందలాదిగా ఎయిర్‌పోర్టుకు తరలి వచ్చారు. వారితో కలిసి సెల్ఫీలు దిగడానికి, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి ఎగబడ్డారు.

ఈ సందర్భంగా గొంగడి త్రిష మాట్లాడుతూ.. విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్ గెలిపించాలని భావించాను. కానీ మూడు పరుగుల ముందు ఔట్ అయ్యాను. అందుకు చాలా బాధ వేసిందని చెప్పింది. భవిష్యత్‌లో సీనియర్ జట్టులో స్థానం సంపాదించి మరింతగా పేరు తెచ్చుకోవాలని ఉన్నట్లు పేర్కొంది.


First Published:  2 Feb 2023 2:07 PM GMT
Next Story