Telugu Global
Telangana

హైదరాబాద్ లో నీరా కేఫ్‌ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిదారులు మాత్రమే నీరాను ఉత్పత్తి, అమ్మకాలు జరిపేలా నీరా పాలసీని రూపొందించామన్నారు.

హైదరాబాద్ లో నీరా కేఫ్‌ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..
X

గీత వృత్తి ప్రోత్సాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల కోసం 5 లక్షల రూపాయల `బీమా`ను కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైన దాదాపు లక్షమంది గీత కార్మికులకు ప్రతి నెల రూ.2,016 పెన్షన్ అందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను, దాని అనుబంధ ఉత్పత్తులైన తేనె, బూస్ట్, షుగర్, బెల్లంలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్థ‌క శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్నమద్యం దుకాణాలలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించటం సాహసోపేతమైన, చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. హరితహారంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 కోట్ల 20 లక్షల తాటి, ఈత మొక్కలు నాటినట్లు వెల్లడించారు. తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికి వేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. అంతేగాక తాటి, ఈత చెట్ల రెంటల్ శాశ్వతంగా రద్దు చేసినట్టు తెలిపారు.

గీత కార్మికుల గత బకాయిలు సుమారు 8 కోట్ల రూపాయలను రద్దు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుడుంబా నిర్మూలనలో భాగంగా పునరావసం కోసం ఎస్సీల్లో 1,068 మంది, ఎస్టీల్లో 2,351 మంది, బీసీల్లో 2,700 మంది, ఇతరుల్లో 125 మంది చొప్పున, మొత్తం 6,299 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 125 కోట్ల 98 లక్షల రూపాయ‌ల‌ గ్రాంట్ ను ఇచ్చినట్టు మంత్రి చెప్పారు. గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ను 2 నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని.. అలాగే, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి గతంలో ఇచ్చిన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని 5 లక్షల రూపాయలకు పెంచామన్నారు. కల్లు దుకాణాలు నెలవారి కిస్తీ, తాటి, ఈత చెట్ల పన్ను రద్దు చేయడం ద్వారా 7,743 కల్లు దుకాణాలకు చెందిన 2లక్షల 34 వేల 576 కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.

ప్రమాదవశాత్తు తాటిచెట్టు నుండి పడి చనిపోయిన 777 మంది గీత కార్మిక కుటుంబాలకు, 1966 మంది శాశ్వత అంగ వైకల్యం చెందిన కార్మికులకు 5లక్షల రూపాయల చొప్పున, తాత్కాలిక వైకల్యం చెందిన 2,725 మంది గీత కార్మికులకు 63 కోట్ల 55 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో అందించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిదారులు మాత్రమే నీరాను ఉత్పత్తి, అమ్మకాలు జరిపేలా నీరా పాలసీని రూపొందించామన్నారు.

గీత కార్మికులకు లైసెన్సుల కాలపరిమితిని 5 ఏండ్ల నుంచి 10 ఏండ్ల‌ వరకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో గీత పారిశ్రామిక సహకార సంఘాలను రద్దు చేసి కల్లు అమ్మకాలపై నిషేధం విధించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో రద్దు చేసిన కల్లు దుకాణాలను తెరిపించి గీత కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్నిత్వరలోనే ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Next Story