Telugu Global
Telangana

తెలంగాణ రాష్ట్రం దేశానికి అద్భుతమైన క్రీడాకారులను అందిస్తోంది - మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్‌కు చెందిన ధనుష్ శ్రీకాంత్ చెవిటి, మూగ అయినప్పటికీ ఓపెన్ కేటగిరీ షూటింగ్‌లో అంతర్జాతీయ పతకాలను సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమ‌న్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికి అద్భుతమైన క్రీడాకారులను అందిస్తోంది - మంత్రి శ్రీనివాస్‌గౌడ్
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా CM CUP ను నిర్వహించినట్టు తెలిపారు. జర్మనీ లోని షూల్ పట్టణంలో ఈ నెల 1 నుంచి 7 వరకు జరిగిన జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో హైదరాబాద్‌కు చెందిన ధనుష్ శ్రీకాంత్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ మెడల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో సిల్వర్ మెడల్‌ను సాధించారు. ధనుష్ శ్రీకాంత్‌ను మంత్రి తన కార్యాలయంలో అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసగౌడ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన ధనుష్ శ్రీకాంత్ చెవిటి, మూగ అయినప్పటికీ ఓపెన్ కేటగిరీ షూటింగ్‌లో అంతర్జాతీయ పతకాలను సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమ‌న్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి పేరు తెచ్చేలా మరిన్ని పత‌కాలు తేవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి.. వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సుమారు 15 వేల గ్రామాలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్న‌ట్టు చెప్పారు. ఇప్పటికే సుమారు 45 క్రీడా మైదానాల నిర్మాణ ప‌నులను పూర్తి చేసి ప్రారంభించామన్నారు.

సీఎం కేసీఆర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి ప్ర‌తిభ గ‌ల క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని రూపొందించామన్నారు. ఇటీవల ప్రపంచ స్థాయి ఛాంపియన్ షిప్ లలో తెలంగాణ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధిస్తున్నారని తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు దేశంలోనే మూడో స్థానం సాధించారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు తేస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి, విలువైన ప్రదేశాలలో ఇంటి స్థలాలను అందజేసి ప్రోత్సహిస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ - గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీలు రాష్ట్రం గ‌ర్వ‌ప‌డేలా అద్భుతమైన క్రీడాకారులను దేశానికి అందజేస్తున్నాయ‌న్నారు. ఈ కార్యక్రమంలో రోలర్ స్కేటింగ్ అంతర్జాతీయ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత అనూప్ యామ, హైదరాబాద్ జిల్లా డివైఎస్ఓ సుధాకర్, ఆశా శ్రీకాంత్, అరుణ్ నాయక్, గగన్ నారంగ్ అకాడమీ ప్రతినిధులు గౌతం తదితరులు పాల్గొన్నారు.

First Published:  15 Jun 2023 11:37 AM GMT
Next Story