Telugu Global
Telangana

గౌడ ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాజకీయ కక్షతో గత ప్రభుత్వాలు కల్లును నిషేధించాయి. కానీ తెలంగాణ ఏర్పాటు అయ్యాక గౌడ కులస్థులకు ఎన్నో ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.

గౌడ ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు బాగుండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి నిధులు అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కోకాపేట్‌లో నిర్మించనున్న గౌడ ఆత్మ గౌరవ భవనానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

రూ.10వేల కోట్ల విలువైన భూమిని బడుగు, బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ కేటాయించారని చెప్పారు. ఇందుకు ప్రతీ గౌడ కులస్థులు రుణపడి ఉండాలని చెప్పారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాలు కల్లును నిషేధించాయి. కానీ తెలంగాణ ఏర్పాటు అయ్యాక గౌడ కులస్థులకు ఎన్నో ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఎక్సైజ్ శాఖ వేధింపులు తగ్గించడమే కాకుండా.. వైన్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

ఇంత వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా.. గౌడ కులస్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. నీరా పాలసీని కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లు తాగితే కరోనా రాదని అప్పుడు చెప్పాను.. ఇప్పుడు కూడా కల్లు వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నానని అన్నారు.

సర్వాయి పాపన్న జయంతి, వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నాము. ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహాన్ని పెట్టబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడిపోయి.. చనిపోతే.. రూ.5 లక్షల పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్థులకు ఇంత చేస్తున్నప్పుడు.. మనం కూడా ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు.

పొట్టి తాటి చెట్లు కూడా త్వరలోనే వస్తాయని.. చెట్లపై నుంచి పడిపోకుండా సేఫ్టీ మోకును కూడా అందించాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కల్లు కాంపౌండ్‌ ఒక కుటీర పరిశ్రమ లాంటిది.. అక్కడ ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతాయని అన్నారు. దాబాల లాగా.. తాటి బార్లను కూడా ఏర్పాటు చేయాలి.. కల్లును కల్తీ చేయాల్సిన అవసరం గౌడ కుటుంబాలకు లేదని మంత్రి చెప్పారు.


First Published:  25 Jun 2023 11:38 AM GMT
Next Story