Telugu Global
Telangana

అంగన్వాడీలు అర్థం చేసుకోండి- మంత్రి సత్యవతి రాథోడ్

అంగన్వాడీ టీచర్లు, ఆయాల సేవలను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ 3 సార్లు వేతనాలు పెంచారని గుర్తు చేశారు.

అంగన్వాడీలు అర్థం చేసుకోండి- మంత్రి సత్యవతి రాథోడ్
X

తెలంగాణలో అంగన్వాడీలు సమ్మె విరమించాలని పిలుపునిచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని కోరారు. సమస్యలుంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుందామని అన్నారామె. మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెడ్డ పేరు తీసుకురావద్దని అభ్యర్థించారు. సమాజంలో గర్భిణిలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువమంది బలహీన వర్గాల వారే ఉన్నారని, సమ్మెతో వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు.


సాయం మరచిపోతే ఎలా..?

అంగన్వాడీ టీచర్లు, ఆయాల సేవలను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ 3 సార్లు వేతనాలు పెంచారని గుర్తు చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్వాడీలకు రూ.7,600 వరకు వేతనాలు అందుతున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కనీసం అంగన్వాడీలను ఆయా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణలో అందుతున్న సదుపాయాలు, అధిక వేతనాల విషయంలో ఆలోచన చేయాలని కోరారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

పొరుగు రాష్ట్రం ఏపీలో అంగన్వాడీ టీచర్లకు రూ.11,500, కర్నాటకలో రూ.9500, కేరళలో రూ.6500, మధ్యప్రదేశ్ లో రూ.11500, మహారాష్ట్రలో రూ.6500, గుజరాత్ లో రూ.7800, రాజస్థాన్ రూ.6230, పశ్చిమ బెంగాల్ లో రూ.8250 మాత్రమే నెలజీతం ఇస్తున్నారని.. తెలంగాణతో పోల్చి చూస్తే అక్కడ జీతాలు తక్కువ అని చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్. రెండు లక్షల జీవిత బీమా, ఎక్స్ గ్రేషియా సౌకర్యాలను కల్పించిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. వాస్తవాలు గ్రహించి వెంటనే విధులకు హాజరు కావాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు మంత్రి.

అంగన్వాడీలకు న్యాయం చేసింది, చేయబోయేది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. త్వరలో ఏర్పాటు కాబోతున్న PRCలో కూడా వారికి లబ్ధి చేకూరుతుందని భరోసా ఇచ్చారు. కొంతమంది ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు.

First Published:  21 Sep 2023 3:03 AM GMT
Next Story