Telugu Global
Telangana

పరేడ్ గ్రౌండ్స్ సభ బీజేపీకి మైనస్.. మునుగోడు మాదేనంటున్న టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా పరేడ్ గ్రౌండ్స్ బీజేపీ సభలో లేరని ఎద్దేవా చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

పరేడ్ గ్రౌండ్స్ సభ బీజేపీకి మైనస్.. మునుగోడు మాదేనంటున్న టీఆర్ఎస్
X

పరేడ్ గ్రౌండ్స్ సభ బీజేపీకి పెద్ద మైనస్ అని తేలిపోయిందని, ఆ సభ జనం లేక వెలవెలపోయిందని, ప్రజలు ఎటువైపు ఉంటారో తేలిపోయిందని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అమిత్ షా సభతో ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏంటో తేలిపోయిందని చెప్పారాయన. గజినీ మహమ్మద్ కంటే ఎక్కువగా తెలంగాణపై బీజేపీ నేతలు దండయాత్రకు వస్తున్నారని, గజినీలాగే వీరికి కూడా భంగపాటు తప్పదని చెప్పారు.

ఇక్కడికే ఎందుకు..?

నిజాంతోపాటు విలీనం అయిన ఇతర సంస్థానాల విషయంలో బీజేపీ ఇంత హడావిడి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. కేవలం మునుగోడు ఉపఎన్నిక కారణంగానే బీజేపీ నేతలు తెలంగాణను టార్గెట్ చేశారని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కేవలం తెలంగాణకే బీజేపీ నేతలు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తెలంగాణ వజ్రోత్సవాలు సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఘనంగా జరుగుతుంటే, ఇతర రాష్ట్రాల నుండి దండయాత్రలు చేస్తున్నారని అన్నారు. రాజధాని నడిబొడ్డున పోలీసుల కవాతు దేనికి సంకేతం అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అన్నారు. తెలంగాణ చరిత్ర నేపథ్యం గురించి వారికి ఏం తెలుసని ప్రశ్నించారు. కేసీఆర్ మినహా ఇతరులను ఇక్కడి ప్రజలు నమ్మరని అన్నారు ప్రశాంత్ రెడ్డి. పోరాటాలు తెలంగాణకు కొత్త కాదని, ఇక్కడి ప్రజలు గాజులు తొడుక్కోలేదని, బీజేపీ నేతలు జీవిత కాలం ఢిల్లీ గద్దెపై ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే తెలంగాణ మీద దండయాత్రకు వస్తున్నారా అని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీజేపీ కి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా పరేడ్ గ్రౌండ్స్ బీజేపీ సభలో లేరని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు వచ్చి రేషన్ షాపుల్లో గొడవలు పెడుతున్నారని, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని ప్రధాని మోదీ గుర్తుంచుకోవాలని చెప్పారు ప్రశాంత్ రెడ్డి.

First Published:  19 Sep 2022 2:20 AM GMT
Next Story