Telugu Global
Telangana

వివాదంలో మంత్రి పొన్నం.. కాస్ట్‌లీ కారులో చక్కర్లు..!

ముత్యాల సునీల్ కుమార్‌ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత. ఈ ట్రావెల్స్‌కు దాదాపు 550కి పైగా బస్సులు ఉన్నాయి. ట్రావెల్స్ రంగంలో ఆయన చాలా కాలంగా ఉన్నారు.

వివాదంలో మంత్రి పొన్నం.. కాస్ట్‌లీ కారులో చక్కర్లు..!
X

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందుకు కారణం ఆయన వాడుతున్న టయోటా వైల్డ్‌ఫైర్‌ కారు. ఈ కారు విలువ దాదాపు రూ.కోటిన్నర. ఈ కారులో మంత్రి సీతక్కతో కలిసి సోమవారం మేడారం జాతరకు వెళ్లారు పొన్నం ప్రభాకర్‌.

అయితే అధికారంలోకి రాకముందు వేరే కారులో తిరిగిన పొన్నం ప్రభాకర్‌.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే ఇంత కాస్ట్‌లీ కారులో తిరగడం చర్చనీయాంశమైంది. 22BH7358D నంబర్‌తో ఉన్న ఈ కారు ముత్యాల సునీల్ కుమార్‌ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.

ముత్యాల సునీల్ కుమార్‌ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత. ఈ ట్రావెల్స్‌కు దాదాపు 550కి పైగా బస్సులు ఉన్నాయి. ట్రావెల్స్ రంగంలో ఆయన చాలా కాలంగా ఉన్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలకు రవాణా శాఖతో ఎక్కువ డీలింగ్స్ ఉంటాయి. అలాంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ట్రావెల్ ఏజెన్సీ అధినేత కారు వాడుతుండడం ఇప్పుడు ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ముత్యాల సునీల్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.

First Published:  7 Feb 2024 5:46 AM GMT
Next Story