Telugu Global
Telangana

వరదలకంటే ఎక్కువ అక్కసు ప్రతిపక్షాలది..

కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌస్‌ లు మునిగిపోతే ప్రభుత్వం తప్పు చేసినట్లు విపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

వరదలకంటే ఎక్కువ అక్కసు ప్రతిపక్షాలది..
X

గోదావరి వరదల కంటే ఎక్కువ అక్కసుతో విపక్షాలు మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. 28 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునే సామర్థ్యంతో కాళేశ్వరం డిజైన్ చేశామని చెప్పారాయన. గ‌తంలో వరద ప్రవాహాలను దృష్టిలో పెట్టుకునే 107.05 మీటర్ల మేర హై ఫ్లడ్ లెవల్ పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. అతి పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా సాంకేతికంగా ఏ చిన్న లోపం కూడా తలెత్తకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, అందుకే ప్రాజెక్ట్ కి ఏమీ కాలేదని, కేవలం పంప్ హౌస్ లు మాత్రమే నీట మునిగాయని వివరించారు. తాజాగా గోదావరి వరద 500 ఏళ్లకోసారి వచ్చే విపత్తు అని సాక్షాత్తూ కేంద్ర జల సంఘం ప్రకటించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌస్‌ లు మునిగిపోతే ప్రభుత్వం తప్పు చేసినట్లు విపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

1998, 2009 వరదల సమయంలో శ్రీశైలం ప్రాజెక్ట్ మునిగిపోలేదా? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. జూరాల ప్రాజెక్టు ని నీటి లభ్యత ఉన్న చోటే కట్టిందా లేదా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ప్రపంచ ప్రఖ్యాత నీటి రంగ నిపుణుడు, తెలంగాణ బిడ్డ పెంటారెడ్డిని అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో పెంటారెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టులు కట్టలేదా? అని ప్రశ్నించారు.

తుంగభద్రపై గల అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి జాతీయ హోదా సహా రూ.1250 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించిన దృష్ట్యా.. పాలమూరు ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు నిరంజన్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే 180పైగా కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయినా కూడా ఆ ప్రాజెక్టులేవీ ఆగవని.. ఏడాదిన్నరకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు నిరంజన్ రెడ్డి.

స్వరాష్ట్రం తెలంగాణ తెచ్చి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ గొప్పతనం గురించి మాత్రం విపక్షాలు ఒక్క మాట కూడా మాట్లాడవని అన్నారు నిరంజన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మహాద్భుతం అని అన్నారాయన. ప్రపంచమంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కీర్తిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు.

First Published:  24 July 2022 11:09 AM GMT
Next Story