Telugu Global
Telangana

ఐటీ దాడులతో ఫేమస్ అయ్యా.. అంతకు మించి పోయిందేమీ లేదు

ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలను వరుస పెట్టి టార్గెట్ చేస్తోందన్నారు. ఇలా జరుగుతుందని కేసీఆర్ ముందే తనకు చెప్పారని.. వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఐటీ దాడులతో ఫేమస్ అయ్యా.. అంతకు మించి పోయిందేమీ లేదు
X

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. తనిఖీలు జరిగిన తీరుపై మంత్రి మల్లారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని, వారికి తోచినట్టు లెక్కలు రాసుకుని సంతకాలు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

ఐటీ దాడులు తనకేమీ కొత్తకాదని.. 1994, 2008, ఇప్పుడు మరోసారి దాడులు జరిగాయన్నారు. 200 ఇన్నోవా వాహనాల్లో 600 మంది వచ్చి ఒకేసారి దాడులు చేశారని ఇప్పటి వరకు తాను ఇంత పెద్ద రైడ్ చూడలేదన్నారు. వచ్చిన వారిని తాము ఆహ్వానించామని, భోజనాలు కూడా పెట్టామని, తన వద్ద, తన కుమారుడి దగ్గర కలిసి మొత్తం 28 లక్షలు మాత్రమే వారికి దొరికాయ‌న్నారు.

కాలేజీల్లో పనిచేసే క్లర్కుల నివాసాల్లో కూడా సోదాలు చేశారన్నారు. అయినా ఏమీ దొరకలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం వల్లనే ఈ తరహాలో దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న తన కుమారుడిని బెదిరించి 100 కోట్లు డొనేషన్ల రూపంలో వసూలు చేసినట్టు పత్రాలు సృష్టించి సంతకాలు తీసుకున్నారని మల్లారెడ్డి చెప్పారు.

100 కోట్లు డొనేషన్ల రూపంలో తీసుకున్నట్టు ఐటీ ఆరోపించిందని.. ఎక్కడ నుంచి వసూలు చేశామో చూపెట్టాలని తాము కూడా న్యాయపోరాటం చేస్తామన్నారు. 2008లో జరిగిన ఐటీ దాడుల్లో భారీగా బంగారం కూడా పట్టుకెళ్లారని ఇప్పటికీ బంగారాన్ని అప్పగించలేదని, న్యాయపోరాటం నడుస్తూనే ఉందన్నారు. మూడుసార్లు ఐటీ దాడులతో తన గ్రాఫ్ మరింత పెరిగిందని, తాను మరింత ఫేమస్ అయ్యానని.. అందుకు మించి ఇందులో భయపడటానికి, బాధపడటానికి ఏమీ లేదన్నారు.

ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలను వరుస పెట్టి టార్గెట్ చేస్తోందన్నారు. ఇలా జరుగుతుందని కేసీఆర్ ముందే తనకు చెప్పారని.. వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

First Published:  24 Nov 2022 3:58 AM GMT
Next Story