Telugu Global
Telangana

బంధువుల ఇంట్లో పార్టీ చేసుకుంటే తప్పా? : మంత్రి మల్లారెడ్డి

తానేదో చేయకూడని పని చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదని.. ఇది కచ్చితంగా బీజేపీ చేస్తున్న కుట్రే అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

బంధువుల ఇంట్లో పార్టీ చేసుకుంటే తప్పా? : మంత్రి మల్లారెడ్డి
X

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి మందు, విందుతో ఎంజాయ్ చేస్తున్నారంటూ బీజేపీ నానా రచ్చ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఆదివారం వైరల్‌గా మారింది. ఓ ఇంట్లో కొంత మందితో కూర్చొని ఉన్న మల్లారెడ్డి చేతిలో మద్యం ఫుల్ బాటిల్ ఉన్నది. ఆయన ఎదుట ఉన్న వాళ్లకు సర్వ్ చేస్తున్నట్లుగా ఆ ఫొటోలో కనపడుతోంది. దీనిపై బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఓ రాష్ట్రానికి మంత్రైన వ్యక్తి తాగి ఉపఎన్నికల ప్రచారం చేస్తున్నాడంటూ విరుచుకపడ్డారు. ఇలాంటి పార్టీకా ఓటేసేది అంటూ దుయ్యబట్టారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా దీనిపై మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు.

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి తనకు అప్పగించిన గ్రామాల్లో ఆదివారం ప్రచారం చేశాను. అది ముగిసిన తర్వాత తన బంధువుల ఇంట్లో విందుకు హాజరయ్యాను. ఆ ఫొటోలో ఉన్నది నా బావలు, సోదరులే అని మంత్రి చెప్పారు. తానేదో చేయకూడని పని చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ చేస్తున్న కుట్రే అని మంత్రి చెప్పుకొచ్చారు. తాను మునుగోడు రావడం ఇదే మొదటి సారి కాదని.. గతంలో కూడా ఎన్నోసార్లు మా బంధువుల ఇంటికి వచ్చి విందులు చేసుకున్నానని తెలిపారు. తన బంధువులు ఎవరు ఆహ్వానించినా వారింటికి వెళ్లి పార్టీ చేసుకోవడం నాకు అలవాటని చెప్పుకొచ్చారు.

అలాగే ఆదివారం ప్రచారం ముగిసిన తర్వాత బంధువల ఇంటికి వెళ్లాను. అప్పటి వరకు తాను మందు కూడా ముట్టుకోలేదు. ఆ ఫొటో తీసే సమయానికి కూడా నేను మందు తాగడం లేదు. కావాలంటే వాళ్లు తీసుకున్న ఫొటోనే చూడండి. నా ప్లేట్ ఖాళీగానే ఉన్నది. ఇందులో తప్పేం ఉందో నాకు అర్థం కావడం లేదని మంత్రి మల్లారెడ్డి వాపోయారు. బీజేపీ ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అంటోంది. ఎన్నికల సంఘానికి కాకపోతే సీబీఐ విచారణ చేయించుకోండని మంత్రి ఎద్దేవా చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు. ఓడిపోతున్నామనే బాధలోనే బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

First Published:  10 Oct 2022 8:28 AM GMT
Next Story