Telugu Global
Telangana

ఆ మూడు తప్ప అన్నీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోతాయి..

జేడీయూ తర్వాత ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేదెవరో అని ట్వీట్ పెట్టారు. అక్కడితో ఆగితే కేటీఆర్ స్పెషాలిటీ ఏముంది. ఆ కూటమిలోనుంచి మూడు మాత్రం బయటకు రావంటూ సెటైర్ పేల్చారాయన.

ఆ మూడు తప్ప అన్నీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోతాయి..
X

ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్న ఎన్డీఏకి జేడీయూ పెద్ద షాకిచ్చింది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఆర్జేడీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ రాజకీయ చతురత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకూ తమకు ఎదురు లేదని విర్రవీగుతున్న ఎన్డీఏ ఇకపై జాగ్రత్తపడాల్సిన సందర్భం అది. ఎన్డీఏకి మున్ముందు మరిన్ని షాకులు తప్పవు అన్నట్టు ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. జేడీయూ తర్వాత ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేదెవరో అని ట్వీట్ పెట్టారు. అక్కడితో ఆగితే కేటీఆర్ స్పెషాలిటీ ఏముంది. ఆ కూటమిలోనుంచి మూడు మాత్రం బయటకు రావంటూ సెటైర్ పేల్చారాయన.

ఎన్డీఏ అధికారంలో ఉండటంతో.. సీబీఐ, ఐటీ, ఈడీలను గుప్పిట పెట్టుకుని వైరి వర్గాలను భయపెట్టి తమ పంతం నెగ్గించుకుంటోంది. ఆ అధికారం ఉన్నంతకాలం సీబీఐ, ఐటీ, ఈడీ విభాగాలు వారికే వత్తాసు పలుకుతాయి. ముందు జాగ్రత్తగా కూటమిలోనుంచి పార్టీలు బయటకు వెళ్తాయి కానీ, ఆ మూడింటికి మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఈ విషయాన్నే కేటీఆర్ కాస్త సెటైరిక్ గా ట్వీట్ చేశారు. కూటమిలోనుంచి ఎవరెవరు బయటకెళ్లినా.. సీబీఐ, ఐటీ, ఈడీకి మాత్రం మినహాయింపు ఉంటుందని చెణుకులు విసిరారు.

ఆ కార్టూన్స్ అదరహో..

ఆసక్తికరమైన సూక్తులు, స్టేట్మెంట్లను రీట్వీట్ చేస్తుంటారు కేటీఆర్. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆయన కార్టూన్ల జోలికి వెళ్తుంటారు. తాజాగా ఆయన మనసుకి నచ్చిన రెండు కార్టూన్లను కూడా ట్వీట్ చేశారు. బీహార్ లో నితీష్ కుమార్ ఎన్డీఏకి గుడ్ బై చెప్పడంతో.. ఈడీ ఆ రాష్ట్రంపై దృష్టిపెడుతుందనే అర్థం వచ్చేలా ఉన్న కార్టూన్ ని పోస్ట్ చేశారు కేటీఆర్. ఇక మనం బీహార్ కి వెళ్లాల్సి ఉంటుందని ఓ అధికారి తన కొలీగ్ తో అంటున్నట్టుగా ఆ కార్టూన్ మంచి హ్యూమర్ ని పండించింది.

5G అంటే అర్థం ఏంటో తెలుసా..?

G - జీఎస్టీ

G - జీడీపీ

G - గ్యాస్ ధర

G - ప్రభుత్వ ఉద్యోగాలు (గవర్నమెంట్ జాబ్స్)

G - పేదరికంలో పెరుగుదల (గ్రోత్ ఆఫ్ పావర్టీ)

5G అంటే అసలు అర్థం ఇదీ అని చెబుతున్న మరో కార్టూన్ తనకెంతో నచ్చిందని, అందరికీ నచ్చుతుంది అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

First Published:  10 Aug 2022 2:18 AM GMT
Next Story