Telugu Global
Telangana

ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన..

ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన..
X

వరదల కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకూడదు, ప్రాణ నష్టమే కాదు.. ఆస్తినష్టం కూడా జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ నెలలో రికార్డ్ స్థాయిలో 450 శాతం అధిక వర్షపాతం నమోదైందని, అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ లో వరద సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించారు.

నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని సూచించారు కేటీఆర్. ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. జలాశయాలను వీక్షించేందుకు వెళ్లే సందర్శకులను నియంత్రించాలని, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న చోట పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని, సెల్ ఫోన్ లకు మెసేజ్ లు పంపిస్తూ వారిని అలర్ట్ చేయాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలని, శిథిలావస్థలో ఉన్న పాత నిర్మాణాలను వెంటనే తొలగించాలని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులు, నీటి బావులను వెంటనే పూడ్చేలా చర్యలు చేపట్టాలన్నారు కేటీఆర్.

కలుషిత నీటితో అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిషన్‌ భగీరథ నీరు కలుషితం కాకుండా చూడాలని పబ్లిక్‌ హెల్త్‌ అధికారులను ఆదేశించారు కేటీఆర్. వర్షాల కారణంగా ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడే గర్భిణులు, వైద్యం అవసరం ఉన్న వృద్ధులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, వారిని అధికారులే దగ్గరుండి వైద్యం చేయించాలని సూచించారు కేటీఆర్. జిల్లావ్యాప్తంగా దెబ్బతిన్న 335 ఇండ్లకు రూ.11,63,900 పరిహారాన్ని మంత్రి కేటీఆర్‌ మంజూరు చేయించారు.

First Published:  15 July 2022 1:38 AM GMT
Next Story