Telugu Global
Telangana

తెలంగాణకు మోదీ మరో ద్రోహం.. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపున‌కు అడ్డుపుల్ల

తెలంగాణకు మోదీ మరో ద్రోహం.. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపున‌కు అడ్డుపుల్ల
X

ఇటీవల మూడు రాష్ట్రాలకు కేంద్రం బల్క్ డ్రగ్ పార్క్ లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ని ఎంపిక చేసింది. ఆయా రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ లను కేటాయించడంలో తప్పేమీ లేదు, కానీ ఆ ప్రాంతాల్లో పనులు పూర్తవ్వాలంటే, ఫైనల్ ఔట్ పుట్ రావాలంటే మరో నాలుగేళ్లు సమయం పడుతుంది. తెలంగాణలోని ఫార్మాసిటీకి బల్క్ డ్రగ్ పార్క్ కేటాయిస్తే ఏడాది చివరిలోనే పరిశ్రమలో పనులు మొదలవుతాయి. అలాంటి అవకాశాలున్న హైదరాబాద్ ఫార్మాసిటీని విస్మరించడం మోదీ చేసిన ద్రోహం అంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను కేంద్రం తాకట్టుపెడుతోందని ఆయన విమర్శించారు.

ఫార్మాసిటీకి ఏం తక్కువ..?

భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్ తో సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని కావాలనే కేంద్రం విస్మరించిందని అంటున్నారు కేటీఆర్. ఫార్మా రంగాన్ని స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి నిబద్ధత లేదని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని అన్నారు. ఇప్పటికైనా వివక్ష పక్కనపెట్టి, తెలంగాణకు వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఓ లేఖ రాశారు కేటీఆర్.

లైఫ్ సైన్సెస్- ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న దేశ లైఫ్ సైన్సెస్ రాజధాని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా హైదరాబాద్ నగరం ఖ్యాతిగాంచిందని, కానీ బల్క్ డ్రగ్ పార్క్ కి మాత్రం హైదరాబాద్ పనికిరాకుండా పోయిందా అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. జీరో లిక్విడ్ డిశ్చార్జ్, కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ, పూర్తిస్థాయి హీటింగ్, కూలింగ్ వ్యవస్థల ఏర్పాటు, కామన్ డ్రగ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ లేబొరేటరీ వంటి అనేక వినూత్న విభాగాల సమాహారమే హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పారు కేటీఆర్. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కింద హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు ప్రాధాన్యతను దక్కించుకుందని తెలిపారు. ఫార్మాసిటీ ప్రాధాన్యతను గుర్తించి ప్రశంసించిన కేంద్రమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో హైదరాబాద్ ని విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ల కోసం జరిగిన ఎంపికపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.

ప్రస్తుతం ఫార్మా రంగంకోసం వాడే ముడిసరుకులను 70శాతానికి పైగా చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులు ఆపేసి స్వయం సమృద్ధి సాధించాలంటే బల్క్ డ్రగ్ పార్క్ లు కీలకం. 2వేల ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటుకి 2015లో కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ విషయంలో బాగా ఆలస్యమైంది. కొవిడ్ సంక్షోభం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కేంద్రం కళ్లు తెరిచి బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటుకి ప్రణాళికలు సిద్ధం చేసింది. బల్క్ డ్రగ్ పార్క్ ల ఆవశ్యకత తెలిసే.. తెలంగాణకు వాటిని కేటాయించాలని కేంద్ర ఫార్మాసుటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలోనే ప్రతిపాదనలను కూడా సమర్పించామని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ ఫార్మాసిటీ లోని 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి తెలియజేశామన్నారు. మాస్టర్ ప్లాన్ కూడా అందజేశామని, సమగ్ర నివేదిక ఇచ్చామని చెప్పారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్ర మంత్రులను కలిసి బల్క్ డ్రగ్ పార్క్ పై విజ్ఞప్తులు చేసిన విషయాన్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపిందని అంటున్నారాయన.

మోదీ సర్కార్ నిర్వాకంతో దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడుతున్న ఫార్మా పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలగడంతో పాటు బల్క్ డ్రగ్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. దీంతో తెలంగాణతో పాటు యావత్ దేశం కూడా భారీగా నష్టపోతుందన్నారు కేటీఆర్. రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్న కేటీఆర్, బల్క్ డ్రగ్ పార్క్ మంజూరు చేసి తమ ప్రయత్నాలకు కేంద్రం చేదోడు వాదోడుగా నిలవాలన్నారు.

First Published:  2 Sep 2022 11:25 AM GMT
Next Story