Telugu Global
Telangana

వచ్చే వారంలో ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్!

సైక్లింగ్ ట్రాక్ ప్రారంభోత్సవం, ఎయిర్‌పోర్ట్ మెట్రో పనుకు కొబ్బరికాయ కొట్టడం వంటి కార్యక్రమాలు వరుసగా నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వచ్చే వారంలో ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్!
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి ఈ పనులను లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో 13వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. అయితే కేటీఆర్ అమెరికా, దుబాయ్ పర్యటన ముగించుకొని ఇప్పుడే రావడంతో.. కచ్చితమైన తేదీపై నేడో, రేపో ప్రకటన వెలువడనున్నది. సైక్లింగ్ ట్రాక్ ప్రారంభోత్సవం, ఎయిర్‌పోర్ట్ మెట్రో పనుకు కొబ్బరికాయ కొట్టడం వంటి కార్యక్రమాలు వరుసగా నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగర అసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్ట్‌కు వేగవంతమైన కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల పొడవున రూ.6,250 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్ట్ మెట్రోను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ గతేడాది శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఈసీపీ పద్దతిలో గ్లోబల్ టెండర్లను పిలవగా.. ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకున్నది. అయితే ఎల్1గా నిలిచిన సంస్థ వివరాలను ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్.. ప్రభుత్వానికి పంపింది. కానీ ఇంత వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

సర్కారు ఆమోదించి, ఎల్1ను ప్రకటించగానే ఎల్ అండ్ టీ సంస్థ పనులను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యయంతోనే నిర్మిస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం అవసరం. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అక్కడి నుంచి అనుమతి రాగానే.. ఎల్1ను ప్రకటిస్తారని.. ఆ వెంటనే మంత్రి కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. మరో వారంలోపే ఈ పనులన్నీ పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

తొలి దశలో హైదరాబాద్ నగరంలో నిర్మించిన మెట్రో రైలుకు నాగోల్, మియాపూర్‌లో డిపోలు ఏర్పాటు చేశారు. ఇక ఎయిర్‌పోర్ట్ మెట్రోకు విమానాశ్రయంలోనే డిపోను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో డిపో కోసం స్థలం కేటాయించాలని గత నెలలో మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జీఎంఆర్ సంస్థ 48 ఎకరాలను మెట్రో రైలు సంస్థకు అప్పగించింది. త్వరలోనే అక్కడి మెట్రో డిపో డిజైన్‌ను రూపొందించి.. రైల్వే లైన్ నిర్మాణానికి సమాంతరంగా పనులు ప్రారంభించనున్నారు.

First Published:  7 Sep 2023 1:03 AM GMT
Next Story