Telugu Global
Telangana

నేడు నిజామాబాద్ ఐటీ టవర్, కార్పొరేషన్ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీగా గడపనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన హైదరాబాద్‌లో బయలుదేరి 11.15 గంటలకు నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని హెలిప్యాడ్‌లో దిగుతారు.

నేడు నిజామాబాద్ ఐటీ టవర్, కార్పొరేషన్ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
X

ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా టైర్-2 సిటీలకు కూడా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాల్లో ఐటీ టవర్లు ప్రారంభించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా రూ.50 కోట్ల వ్యయంతో ఐటీ టవర్ నిర్మించింది. దీన్ని ఈ రోజు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు జిల్లా కేంద్రంలో న్యాక్, మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను.. అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్ బండ్‌ను కూడా కేటీఆర్ ప్రారంభిస్తారు.

నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీగా గడపనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన హైదరాబాద్‌లో బయలుదేరి 11.15 గంటలకు నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని హెలిప్యాడ్‌లో దిగుతారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.

నిజామాబాద్‌లోని ఐటీ టవర్‌ను 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రూ.50 కోట్ల వ్యయంతో గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్థుల్లో ఈ నిర్మాణం పూర్తి చేశారు. ఎకరం భూమిలో అత్యంత ఆధునికంగా ఐటీ టవర్ నిర్మాణం జరిగింది. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్‌లో ఐటీ టవర్ విస్తరణ కోసం ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఈ టవర్‌లో 750 సీట్ల కెపాసిటీ కలిగి ఉన్నది. 100 సీట్లను టాస్క్‌కు కేటాయించగా.. మిగిలిన వాటిలో 15 కంపెనీలకు చెందిన కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఐటీ టవర్‌లో ఏర్పాటు చేయనున్న కంపెనీల ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఈ నెల 29న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే తెలియజేశారు.

నిజామాబాద్ కలెక్టరేట్, ఐటీ టవర్‌కు ఆనుకొని రూ.6.15 కోట్లతో నిర్మించిన న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్) భవనాన్ని కూడా కేటీఆర్ ప్రారంభిస్తారు. దీనికి నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా నామకరణం చేశారు. ఇందులో 5 స్మార్ట్ క్లాస్ గదులు, 3 ల్యాబ్‌లు, ఒక కంప్యూటర్ ల్యాబ్, 120 మంది అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యానికి వీలుగా హాస్టల్, ఒక కౌన్సిలింగ్ గది, 8 ఆఫీస్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు వైపులా వైకుంఠ ధామాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మూడింటి నిర్మాణం పూర్తి కావడంతో.. మంత్రి కేటీఆర్ వాటిని ఈ రోజు ప్రారంభించనున్నారు. అలాగే రఘునాథ చెరువును రూ.14 కోట్ల వ్యయంతో ఆధునీకరించారు. రూ.7 కోట్ల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు. మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభిస్తారు.


First Published:  9 Aug 2023 1:46 AM GMT
Next Story