Telugu Global
Telangana

హిందీ ఇంపొజిషన్.. ఒప్పుకునేదే లేదు..

మంత్రి కేటీఆర్ హిందీ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. దేశంలో అన్ని భాషలూ సమానమేనని, కానీ హిందీని కేంద్రం నెత్తిన పెట్టుకోవాలనుకోవడం, ఇతర రాష్ట్రాల్లో కూడా హిందీని తప్పనిసరి చేయాలనుకోవడం సరికాదన్నారు.

హిందీ ఇంపొజిషన్.. ఒప్పుకునేదే లేదు..
X

"భారత దేశానికి జాతీయ భాష లేదు, అధికారిక భాషల్లో హిందీ కూడా ఒకటి కానీ హిందీ ఒక్కటే కాదు. అలాంటిది అన్ని రాష్ట్రాలపై హిందీని రుద్దాలంటే ఎలా..? ఐఐటీల్లో హిందీ మీడియంలో బోధన చేయాలనడం, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో హిందీని తప్పనిసరి చేయాలనుకోవడం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే" అని అన్నారు మంత్రి కేటీఆర్. హిందీ ఇంపొజిషన్ ని తాము సమర్థించబోమన్నారు. వీ సే నో టు హిందీ ఇంపొజిషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ ని జత చేసి ట్వీట్ పెట్టారు కేటీఆర్.

కలకలం రేపిన పార్లమెంట్ కమిటీ సిఫారసులు..

దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దాలనే ప్రయత్నం ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో కేంద్ర విద్యా విధానాన్ని మారుస్తూ హిందీకి ఇంకాస్త ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చూసింది కేంద్రం. తాజాగా ఐఐటీల్లో హిందీ మీడియంలో బోధన సాగాలంటూ అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు మరింత సంచలనంగా మారాయి. సాంకేతిక విద్యను హిందీ మీడియంలో నేర్చుకోవడం సాధ్యమేనా..? అలా నేర్చుకుంటే వారు పోటీ ప్రచంపంలో నిలబడగలరా..? ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. హిందీని బలవంతంగా ఇలా విద్యార్థులపై రుద్దాలనుకోవడం సరైన చర్య కాదనే విమర్శలు వినపడ్డాయి.

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన..

అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా పార్లమెంటరీ కమిటీ సిఫారసులపై మండిపడ్డారు. కేంద్రం ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారాయన. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి భారత దేశం నెట్టివేయబడుతోందని హెచ్చరించారు. ఇలాంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట వేయాలన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా హిందీ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. దేశంలో అన్ని భాషలూ సమానమేనని, కానీ హిందీని కేంద్రం నెత్తిన పెట్టుకోవాలనుకోవడం, ఇతర రాష్ట్రాల్లో కూడా హిందీని తప్పనిసరి చేయాలనుకోవడం సరికాదన్నారు. హిందీ ఇంపొజిషన్ ని ని ఒప్పుకునేదే లేదన్నారు.

First Published:  12 Oct 2022 6:03 AM GMT
Next Story