Telugu Global
Telangana

రెజ్లర్లపై దాష్టీకం.. కేటీఆర్ ఘాటు ట్వీట్

రెజ్లర్ల అరెస్ట్ పై నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రపంచ వేదికపై మనకు కీర్తి తెచ్చిన ఛాంపియన్లకు మనం మద్దతివ్వాలని, వారిని మనం గౌరవించాలన్నారు.

రెజ్లర్లపై దాష్టీకం.. కేటీఆర్ ఘాటు ట్వీట్
X

భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం రోజే రెజ్లర్ల నిరసనను అణగదొక్కింది కేంద్రం. జంతర్ మంతర్ శిబిరం ఖాళీ అయిపోయింది. చాపలు, దిండ్లు, దోమతెరలు అన్నీ పోలీసు వ్యాన్లలో ఎక్కించి తరలించేశారు. రెజ్లర్లను బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్లారు, సాయంత్రానికి పోలీస్ స్టేషన్ల నుంచి వదిలిపెట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ కొత్త పార్లమెంట్ లో ఆసీనుడైతే, బాధితులైన రెజ్లర్లు మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇదెక్కడి న్యాయమంటూ విపక్షాలు మండిపడ్డాయి. అసలు బాధ్యతగల నాయకులెవరైనా ఈ ఘటనకు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రెజ్లర్ల అరెస్ట్ లను ఖండిస్తూ ఆయన ఘాటుగా ట్వీట్ వేశారు.


రెజ్లర్ల నిరసనలపై కేంద్రం ఏనాడూ సానుకూలంగా స్పందించలేదు. చర్చలు జరిపారు కానీ, వారికి భరోసా కల్పించలేదు. మరోవైపు బ్రిజ్ భూషణ్ కి వత్తాసు పలుకుతూ బీజేపీ నాయకులు స్టేట్ మెంట్లిచ్చారు, పరోక్షంగా రెజ్లర్లపై ఒత్తిడి పెంచారు. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళనను కఠినంగా అణచివేయడంపై ఏ ఒక్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదు. అంతర్జాతీయ పోటీల్లో భారత్ కు పతకాల పంట పండించిన రెజ్లర్లకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. రెజ్లర్ల అరెస్ట్ పై నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రపంచ వేదికపై మనకు కీర్తి తెచ్చిన ఛాంపియన్లకు మనం మద్దతివ్వాలని, వారిని మనం గౌరవించాలన్నారు కేటీఆర్. రెజ్లర్ల అరెస్ట్ ని, వారి నిరసనపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు.

భారత పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు జరిగిన ఈ అవమానాన్ని మీడియా హైలెట్ చేసినా, బీజేపీ మాత్రం పట్టించుకోకపోవడం విచిత్రం. పతకాలు వచ్చినప్పుడు పొగడ్తల్లో ముంచెత్తి, అదంతా తమ ప్రోత్సాహం ఫలితంగా వచ్చిన ఘనతేనని చెప్పుకునే నేతలు.. సమస్య వచ్చినప్పుడు మాత్రం వెనకడుగు వేయడం, వారిని నష్టపరచాలని చూడటం విచారకరం. ఇన్నాళ్లూ జరిగిన నిరసన ఒక ఎత్తు, పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజు జరిగిన అణచివేత మరో ఎత్తు. ఈ వ్యవహారంపై రెజ్లర్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  29 May 2023 2:18 AM GMT
Next Story