Telugu Global
Telangana

నిత్య కోతల నుండి నిరంతర వెలుగుల ప్రస్థానం

తెలంగాణ విద్యుత్ ప్ర‌గ‌తి.. నిత్య కోత‌ల నుంచి నిరంత‌ర వెలుగుల ప్ర‌స్థానానికి చేరుకుంద‌ని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ 'పవర్' ఫుల్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

నిత్య కోతల నుండి నిరంతర వెలుగుల ప్రస్థానం
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యుత్ విజయోత్సవం జరుగుతోంది. నూతన రాష్ట్రంలో విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, వాటి వల్ల కలిగిన ప్రయోజనాలు, ఉచిత విద్యుత్ తో తీరిన రైతుల కష్టాలు.. వంటి వాటి గురించి ఈరోజు ఊరూవాడా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ విద్యుత్ విజయాన్ని గణాంకాలతో సహా వివరించారు.

తెలంగాణ విద్యుత్ ప్ర‌గ‌తి.. నిత్య కోత‌ల నుంచి నిరంత‌ర వెలుగుల ప్ర‌స్థానానికి చేరుకుంద‌ని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ 'పవర్' ఫుల్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్ రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి, దేశానికే దారిచూపే టార్చ్‌ బేరర్‌ గా తెలంగాణ నిలిచిందన్నారు.


కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్‌ కోసం ధర్నాలు, సబ్‌ స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014కు పూర్వం నిత్యకృత్యాలని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో నిరంతరాయ వెలుగులు మొదలయ్యాయని చెప్పారు. వేసవిలో కూడా అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు.

విద్యుత్ ఉత్పత్తికి, వినియోగానికి సంబంధించిన గణాంకాలే తెలంగాణ విద్యుత్ విజయానికి నిదర్శనం అని అన్నారు కేటీఆర్. రాష్ట్రం ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు కాగా, నేడు అది 18,567 మెగావాట్లకు పెరిగిందన్నారు. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు కాగా, 2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగిందన్నారు. జాతీయ సగటు మాత్రం 1,255 గానే ఉందన్నారు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం, జాతీయ తలసరి వినియోగంకన్నా 69.40 శాతం ఎక్కువగా నమోదవడం మనందరికీ గర్వకారణం అన్నారు కేటీఆర్.

ప‌వ‌ర్ ఐలాండ్

జాతీయ విద్యుత్ గ్రిడ్ విఫలమైనా హైదరాబాద్ నగరంలో కరెంటు సరఫరాకు విఘాతం కలగకుండా పవర్ ఐలాండ్ ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరం చుట్టూ 25 కిలోమీటర్లు, 80-100 కిలోమీటర్లు, 180-200 కిలోమీటర్ల పరిధిలో మూడు వలయాల్లో విద్యుత్ ఐలాండ్ నెలకొల్పామని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో దేశంలోనే తొలి పవర్‌ ఐలాండ్‌ మెట్రో నగరంగా హైదరాబాద్‌ ప్రశంసలు అందుకుంటోందని చెప్పారు.

సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పేద వర్గాల ప్రజలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. చేతి వృత్తులవారికి ఉచిత విద్యుత్, పవర్ లూమ్, పౌల్ట్రీ ఫారాలకు సబ్సిడీ విద్యుత్ తో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నట్టు చెప్పారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత జోరందుకుందని తెలిపారు. సోలార్, జల విద్యుత్తు ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు కేటీఆర్.

First Published:  5 Jun 2023 5:47 AM GMT
Next Story