Telugu Global
Telangana

కాళేశ్వరం జలాలు నెత్తిన చల్లుకో.. పాపం పోతుంది

కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా, కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై చల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి అంటూ రాహుల్ కి చురకలంటించారు కేటీఆర్.

కాళేశ్వరం జలాలు నెత్తిన చల్లుకో.. పాపం పోతుంది
X

మంథని దాకా వెళ్లారు, పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూడా సందర్శించండి రాహుల్ జీ అంటూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం వెళ్లడమే కాదు.. 80 వేల కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టులో, లక్ష కోట్ల అవినీతి అని ఆరోపణలు చేసినందుకు అక్కడే గట్టిగా లెంపలేసుకోవాలన్నారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా, కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై చల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి అంటూ రాహుల్ కి చురకలంటించారు కేటీఆర్.


సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయగాన్ని.. కాంగ్రెస్ నేతలు మరో వంద జన్మలెత్తినా సాధించలేరని అన్నారు మంత్రి కేటీఆర్. దేశానికే టీచింగ్ పాయింట్ కాళేశ్వరం అని చెప్పారు. దేశ సాగునీటి రంగ చరిత్రలోనే ఇది అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతమన్నారు. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి.. బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండి అంటూ రాహుల్ కి హితవు పలికారు. నీరు పల్లమే కానీ, బలమైన సంకల్పం ఉంటే ఎత్తుకు ఎలా పరుగులు పెడుతుందో కాళేశ్వరాన్ని చూస్తే తెలుస్తుందన్నారు. పాతాళంలో ఉన్న గోదావరి నీటిని ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి అని అన్నారు కేటీఆర్.

విమర్శలు మానుకోవాలి..

లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి అని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు కేటీఆర్. కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ.. బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూడండి, చూసి నేర్చుకోండి అని చెప్పారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో అన్నదాతను అరిగోస పెట్టినందుకు సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు తెలంగాణ రైతుకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

First Published:  19 Oct 2023 3:18 PM GMT
Next Story