Telugu Global
Telangana

లోక్ సభ సీట్ల పెంపుపై కేటీఆర్ ట్వీట్..

జనాభా నియంత్రణ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతరు చేయని ఉత్తరాది రాష్ట్రాలు తాము చేసిన తప్పుకి ప్రతిఫలంగా ఎక్కువ లోక్ సభ సీట్లు పొందడం హాస్యాస్పదం అంటున్నారు మంత్రి కేటీఆర్.

లోక్ సభ సీట్ల పెంపుపై కేటీఆర్ ట్వీట్..
X

2026లో లోక్ సభ సీట్ల పెంపు వ్యవహారం ఇప్పుడు భారత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లు పెరిగితే అది దక్షిణాది రాష్ట్రాలకు మరణశాసనం అని తేలిపోయింది. ఉత్తరాదిన బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక సీట్లు, దక్షిణాదిన ఆ పార్టీ అడ్రస్ కూడా లేని రాష్ట్రాలకు గుండు సున్నా.. ఇదీ రాబోయే పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రజలు, నాయకులు సమష్టిగా తమ గళాన్ని వినిపించాలన్నారు.


ఇప్పుడున్న 543 లోక్ సభ సీట్లు 2026లో 848కి పెరిగితే అందులో దక్షిణాది రాష్ట్రాల వాటా కేవలం 165 దగ్గరే ఆగిపోతుంది. ఉత్తరాదిలో రెండు మూడు పెద్ద రాష్ట్రాల్లో బలంచూపించిన పార్టీలు కేంద్రంలో సునాయాసంగా గద్దెనెక్కొచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలన్నీ కూటమి కట్టినా జాతీయ రాజకీయాల్లో వాటి ప్రభావం శూన్యం. ఇలాంటి పరిస్థితి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు కచ్చితంగా నష్టం కలుగుతుందని పలువురు రాజకీయ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా ఉండటమనేది మరింత ఆందోళన కలిగించే అంశం.

జనాభా నియంత్రణలో కఠినంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు పలు ప్రశంసలు దక్కించుకున్నాయి. అంతే కాదు, కేవలం 18శాతం జనాభా ఉన్న ఈ రాష్ట్రాల జీడీపీ వాటా 35శాతం. అంటే జనాభా తక్కువ, సంపద సృష్టిలో భాగస్వామ్యం ఎక్కువ. అయితే కేంద్రం కూడా జనాభా ప్రాతిపదికనే పథకాలు అమలు చేస్తుంది కాబట్టి.. దక్షిణాదికి వచ్చే నిధులు కూడా తక్కువే. ఇప్పటికే నిధుల విషయంలో మోసపోతున్న దక్షిణాది రాష్ట్రాలు, లోక్ సభ సీట్ల పెంపు విషయంలో కూడా అదే ఫార్ములా ఉపయోగిస్తే మాత్రం మరింతగా మోసపోవడం ఖాయం.

జనాభా నియంత్రణ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతరు చేయని ఉత్తరాది రాష్ట్రాలు తాము చేసిన తప్పుకి ప్రతిఫలంగా ఎక్కువ లోక్ సభ సీట్లు పొందడం నిజంగానే హాస్యాస్పదం అంటున్నారు మంత్రి కేటీఆర్. ఆదే సమయంలో జనాభా నియంత్రణలో అద్భుతంగా పనిచేసిన తమిళనాడు, కేరళ, ఏపీ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు.. మంచి చేస్తే వాటికి చెడు ఎదురయినట్టు అవుతోంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గర్వకారణమైన వారిని అణగదొక్కాలనుకోవడం సరికాదంటున్నారు మంత్రి కేటీఆర్. భారత స్వాతంత్రం తర్వాత దక్షిణాది రాష్ట్రాలు అన్ని రంగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచాయని, అందుకే ఈ ప్రతిఫలం ఇస్తున్నారా అని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  30 May 2023 6:11 AM GMT
Next Story