Telugu Global
Telangana

చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు

దశాబ్దాలపాటు చిక్కిశల్యమైన ప్రజారోగ్యానికి శస్త్రచికిత్స సక్సెస్ అయిన వేళ, "ఆరోగ్య తెలంగాణ" కోసం శ్రమిస్తున్న ప్రతిఒక్కరికీ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు
X

"నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు" అనే దుస్థితి నుంచి నేడు "చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు" అనే పరిస్థితి వచ్చిందని అన్నారు మంత్రి కేటీఆర్. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ అప్పటికి ఇప్పటికి మధ్య మారిన పరిస్థితులను ఆయన వివరించారు. సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా ఉండేదని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపం వచ్చిందని చెప్పారు. అప్పట్లో సర్కార్ దవాఖానా అంటే దైన్యం నెలకొని ఉండేదని, నేడు ప్రభుత్వ ఆసుపత్రికెళితే ఒక ధైర్యం కలుగుతుందని అన్నారు.


కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు.. ఇలా తెలంగాణ వైద్య ఆరోగ్య రంగ అభివృద్ధి కోసం చేసిన ప్రతి ఆలోచన ప్రతిష్టాత్మకం అని కొనియాడారు. ప్రతి నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్థానం దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాందీవాచకం అని చెప్పారు మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ నలుదిశలా వైద్యరంగంలో నవశకం ఆవిర్భవించిందన్నారు కేటీఆర్. ఒకేసారి ప్రభుత్వరంగంలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవం అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ సంకల్పం, డాక్టర్ కావాలన్న విద్యార్థుల కలలను సాకారం చేసే మహాయజ్ఞం అని చెప్పారు కేటీఆర్.

తెలంగాణ ఏర్పాటైన తొలి ఏడాది నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ లో వైద్యరంగానికి పెద్దపీట వేశామని, కార్పొరేట్ కి ధీటుగా ప్రతిఏటా బంగారుబాట పరిచామని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నామని అన్నారు. ఆ సమయంలో ప్రాణాలకు తెగించిసేవలందించిన అందరికీ

మరోసారి చేతులెత్తి సలాం చేస్తున్నానని అన్నారు కేటీఆర్.

దశాబ్దాలపాటు చిక్కిశల్యమైన ప్రజారోగ్యానికి శస్త్రచికిత్స సక్సెస్ అయిన వేళ, "ఆరోగ్య తెలంగాణ" కోసం క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యారోగ్య శాఖలోని ప్రతిఒక్కరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

First Published:  14 Jun 2023 7:50 AM GMT
Next Story