Telugu Global
Telangana

కరువు ప్రాంతంలో గోదావరి జలకళ.. ఆ ఎమ్మెల్యేకి కేటీఆర్ అభినందన

కరువు పీడిత ప్రాంతం నేడు జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా గౌరవెల్లికి చేరుకునే సాగునీరు 1.2 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది.

కరువు ప్రాంతంలో గోదావరి జలకళ.. ఆ ఎమ్మెల్యేకి కేటీఆర్ అభినందన
X

ఒకప్పుడు నీళ్లు లేక నిత్యం కరువు తాండవించే ప్రాంతం అది. ఇప్పుడు గోదావరి జలాలతో అక్కడ నేల సస్యశ్యామలం అవుతోంది. దీనికి కారణం సీఎం కేసీఆర్, ఆయన మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోకి గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు ప్రవేశించాయి. కరువు పీడిత ప్రాంతం నేడు జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా గౌరవెల్లికి చేరుకునే సాగునీరు 1.2 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, హుస్నాబాద్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పట్టుదలను అభినందించారు.


సిద్దిపేటలోని అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్ 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగిఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1.41 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ ని ప్రతిపాదించగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ 2015లో గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు అమలైంది, గౌరవెల్లి జలాలతో హుస్నాబాద్ రైతాంగం సంబరపడుతున్నారు.

మిడ్ మానేరు నుంచి సేకరించిన నీటిని తోటపల్లి రిజర్వాయర్ గుండా నార్లాపూర్‌ కు లింక్ కెనాల్ ద్వారా తరలిస్తారు. నార్లాపూర్‌ నుంచి రేగొండ వరకు 12 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వి, రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌ హౌస్‌ నిర్మించారు. రేగొండ పంప్ హౌస్ నుంచి 126 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసి గౌరవెల్లిలోకి వదులుతున్నారు. ట్రయల్ రన్‌ లో భాగంగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1 టీఎంసీ మేర నీటిని నింపుతున్నారు. ఈ రిజర్వాయర్ వల్ల మొత్తంగా 1.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

First Published:  2 July 2023 5:30 AM GMT
Next Story