Telugu Global
Telangana

జూన్ 6న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌తో పాటు బాంకెట్ హాల్, ఆడిటోరియం, బ్యాంక్, రెస్టారెంట్. పరిశ్రమలకు సంబంధించిన వస్తువుల సూపర్ మార్కెట్, పరిశ్రమల శాఖ కార్యాలయం, అకౌంటింగ్‌కు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి.

జూన్ 6న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
X

తెలంగాణ యువత ఉద్యోగాలు సాధించడంలో ఉపయోగపడే శిక్షణను అందించే అతిపెద్ద కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం (జూన్ 6) ప్రారంభించనున్నారు. తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (టీఐఎఫ్) ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో నిర్మించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2.30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ సిద్ధమైంది.

ఈ ఫెసిలిటీ సెంటర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌తో పాటు బాంకెట్ హాల్, ఆడిటోరియం, బ్యాంక్, రెస్టారెంట్. పరిశ్రమలకు సంబంధించిన వస్తువుల సూపర్ మార్కెట్, పరిశ్రమల శాఖ కార్యాలయం, అకౌంటింగ్‌కు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. ఇక్కడ వివిధ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

కొత్త పరిశ్రమల ప్రారంభం..

దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్‌ను మరింతగా విస్తరించనున్నారు. ఇప్పటికే 542 ఎకరాలు ఈ పార్క్ కోసం కేటాయించగా.. రాబోయే రోజుల్లో అదనంగా 1,863 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 231 ఎకరాల్లో యాదాద్రి ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, 100 ఎకరాల్లో టాయ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 6న మంత్రి కేటీఆర్ టాయ్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు సమీపంలో రూ.236 కోట్లతో టౌన్ షిప్‌కు అవసరమైన విద్యుత్ సరఫరా, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ 196 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ రానున్నది. ఇక్కడ స్కూల్స్, కమర్షియల్ మార్కెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తారు.


First Published:  5 Jun 2023 10:05 AM GMT
Next Story