Telugu Global
Telangana

చేతనైతే తెలంగాణకు సలామ్ కొట్టు.. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం : అసెంబ్లీలో బీజేపీపై కేటీఆర్ ఫైర్

చేతనైతే వచ్చి తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు సలాం అని చెప్పండి. అంతే కానీ వెటకారపు మాటలు మాట్లాడవద్దని కేటీఆర్ హెచ్చరించారు.

చేతనైతే తెలంగాణకు సలామ్ కొట్టు.. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం : అసెంబ్లీలో బీజేపీపై కేటీఆర్ ఫైర్
X

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిపక్ష నేత, బీజేపీ సభ్యుడు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని మంత్రి విమర్శించారు. ఎవరి సొమ్ముతో ఎవరు బాగుపడుతున్నారో తెలుసుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమే రూ.2.25 లక్షల కోట్లు బాకీ ఉన్నారని లెక్కలు చూపించారు.

తెలంగాణకు రావాల్సిన డబ్బులన్నీ యూపీలో ఖర్చు పెడుతున్నారు. థ్యాంక్స్‌టూ తెలంగాణ అని యూపీలో బోర్డు పెడతారా అని బీజేపీ సభ్యులకు సవాలు విసిరారు. ఇక్కడకు వచ్చి రేషన్ షాపుల్లో మోడీ బొమ్మ ఎందుకు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చి లొల్లి చేస్తారు. మరి మా పైసలతో దేశమంతా అభివృద్ధి చేస్తున్నారు. మరి థ్యాంక్స్ టూ తెలంగాణ అని హోర్డింగులు పెడతారా.. అసలు పెట్టరు కదా అని కేటీఆర్ అన్నారు. దేశ, జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం అయినందుకు సంతోషపడుతున్నామని కేటీఆర్ చెప్పారు.

చేతనైతే వచ్చి తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు సలాం అని చెప్పండి. అంతే కానీ వెటకారపు మాటలు మాట్లాడవద్దని కేటీఆర్ హెచ్చరించారు. మా ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్ట వద్దని.. ఆకలినైనా భరిస్తాం కానీ.. మా ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తే మాత్రం ఊరుకోమని అన్నారు. మళ్లీ ఇలాగే మాట్లాడితే ఇటుకతోనో, రాయితోనో కొట్టినట్లు సమాధానం చెబుతామని కేసీఆర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

తెలంగాణ ఇప్పుడు దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిందని.. రాష్ట్రంలో కరెంట్ కష్టాలు , తాగునీటి తిప్పలు లేవని అన్నారు. సంక్షేమంలో ప్రభుత్వానికి తిరుగే లేదని చెప్పారు. ఇప్పుడు దేశ ప్రజలందరి చూపి సీఎం కేసీఆర్ వైపే ఉందన్నారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయ లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు మాది కుటుంబ పాలన అని అంటున్నారు. అవును మాది కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మా కుటుంబమే అని చెప్పారు.

రాష్ట్రంలో నిధుల వరద పారుతోందని.. నియమకాల కల సాకారం అవుతోందని అన్నారు.కేంద్ర ప్రకటించిన 20 అత్యుత్తమ గ్రామ పంచాయతీల్లో 9 మన రాష్ట్రానికి చెందినవే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలోకి రాక ముందు విద్యుత్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో ఒక సారి ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలని అన్నారు. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తున్నారని చెప్పారు. ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చుకున్నామని చెప్పారు. సాగునీటి రంగంలో తెలంగాణ ఎన్నో గొప్ప విజయాలు సాధించిందని అన్నారు.

రైతు బంధు ఒక అసాధారణమైన కార్యక్రమమని కేటీఆర్ అభివర్ణించారు. ఇలాంటి ఆలోచనలు అసాధారణ నాయకులకే వస్తాయని ఆయన చెప్పారు. 65 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్ రూ.65 వేల కోట్లు జమ చేశారని.. ప్రపంచంలోనే ఇదొక వినూత్నమైన పథకమని కేటీఆర్ వెల్లడించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం నల్ల వ్యవసాయ చట్టాలు చేసి.. 700 మంది రైతుల ప్రాణాలను తీసుకున్నదని మండిపడ్డారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ఎక్కడా ఉండడని కేటీఆర్ పేర్కొన్నారు.

First Published:  4 Feb 2023 11:09 AM GMT
Next Story