Telugu Global
Telangana

బీజేపీ జోకర్ల కుట్ర.. అడ్డుకుని తీరుతాం- కేటీఆర్‌

తెలంగాణలో కొంతమంది దివాళా తీసిన జోకర్లు రాజకీయం కోసం తప్పుడు ప్రచారం ద్వారా మతహింసను ప్రేరేపించడం సహా వర్గాల మధ్య విభజనను ప్రోత్సహించేలా పయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ జోకర్ల కుట్ర.. అడ్డుకుని తీరుతాం- కేటీఆర్‌
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ.. తనకు అలవాటైన పద్ధతిలో కుట్రలకు తెరతీస్తోంది. తెలంగాణలో ముస్లింలను టార్గెట్‌ చేస్తూ రజాకార్‌-ది సైలెంట్‌ జెనోసైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌.. సినిమాను తెరపైకి తీసుకువస్తోంది. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహిస్తుండగా.. బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ఈ సినిమా టీజర్‌ కాంట్రవర్సీగా మారింది. చాలా మంది రజాకార్‌ మూవీ టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ సైతం ట్విట్టర్‌ వేదికగా చిత్ర బృందంపై తీవ్ర ఆ్రగహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొంతమంది దివాళా తీసిన జోకర్లు రాజకీయం కోసం తప్పుడు ప్రచారం ద్వారా మతహింసను ప్రేరేపించడం సహా వర్గాల మధ్య విభజనను ప్రోత్సహించేలా పయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ విషయాన్ని సెన్సార్‌ బోర్డుతో పాటు తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ముబాషిర్‌ ఖుర్రం అనే వ్యక్తి రజాకార్‌ మూవీ టీజర్‌ను జోడిస్తూ తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాలని తెలంగాణ సీఎంవో, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావులను ట్విట్టర్‌ వేదికగా కోరాడు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ అవసరమైన చర్యలన్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు.

1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్‌కు రాలేదంటూ ఈ టీజర్ మొదలవుతుంది. మా రాజ్యం తుర్కిస్థాన్‌ అనే స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా వర్ధిల్లుతుంది అనే డైలాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తుంది. టీజర్‌ మొత్తం నిజాంతో పాటు ముస్లింలను టార్గెట్‌ చేస్తూ చూపించారు. ఈ టీజర్‌ చూసినవారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీశారని మండిపడుతున్నారు. గతంలోనూ పలు రాష్ట్రాల ఎన్నికల టైంలో వచ్చిన కశ్మీర్‌ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

First Published:  18 Sep 2023 10:54 AM GMT
Next Story