Telugu Global
Telangana

అయిననూ పోయి రావలె హస్తినకు..

స్కైవేస్ నిర్మాణానికి కంటోన్మెంట్ భూములు అడ్డుగా ఉన్నాయని చెప్పారు కేటీఆర్. కంటోన్మెంట్ పరిధిలోని లీజ్ ల్యాండ్ లను కార్పొరేషన్ కి బదలాయించాలని రాజ్ నాథ్ సింగ్ ని కోరామని, హైదరాబాద్ లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు సహకరించాలని అడిగామన్నారు.

అయిననూ పోయి రావలె హస్తినకు..
X

తొమ్మిదేళ్లుగా కేంద్రం తెలంగాణకు పైసా సాయం చేయలేదని, ఇప్పుడు చేస్తుందన్న నమ్మకం కూడా లేదని, అయినా తమ ప్రయత్న లోపం లేకుండా ఢిల్లీ వచ్చి కేంద్రం సహకారాన్ని కోరామని చెప్పారు మంత్రి కేటీఆర్. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనతో తాము ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నామని చెప్పారు.


హైదరాబాద్ అన్నిరంగాల్లో విస్తరిస్తోందని తెలిపారు మంత్రి కేటీఆర్. దేశంలోని ఐటీరంగంలో 44 శాతం ఉద్యోగాలు ఒక్క తెలంగాణ నుంచే వస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ తయారీకి తెలంగాణ గ్లోబల్ హబ్ గా మారిందన్నారు. ఫార్మాసుటికల్, ఐటీ, బయోటెక్, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందని, జాతి నిర్మాణానికి ఉపయోగపడే నగరం అని చెప్పారు. అలాంటి హైదరాబాద్ లో మౌలిక వసతుల నిర్మాణంలో తాము కేంద్రం సహకారాన్ని కోరామని అన్నారు కేటీఆర్.


స్కై వేస్ కి సహకరించండి..

చుట్టు పక్కల జిల్లాల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో, నగరం లోపలికి వెళ్లేందుకు అంతకు మించి సమయం పడుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇలాంటి సమస్యల నివారణకు స్కైవేస్ రూపకల్పనకు తాము సిద్ధమయ్యామని, డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లతో ఢిల్లీకి వచ్చామన్నారు. ఈ స్కైవేస్ నిర్మాణానికి కంటోన్మెంట్ భూములు అడ్డుగా ఉన్నాయని చెప్పారు కేటీఆర్. కేంద్రం అధీనంలోని కంటోన్మెంట్ భూములను అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే.. తిరిగి అంతే భూమిని కంటోన్మెంట్ బోర్డ్ కి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 9 ఏళ్లుగా అడుగుతున్నా కనికరించలేదని, అయినా మరోసారి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలసి ఈ విషయాలపై మెమొరాండం సమర్పించామన్నారు కేటీఆర్.


హైదరాబాద్ నగరంలో రెండు స్కై వేస్ ఏర్పాటు చేస్తే ప్రజల కష్టాలు తీరతాయని, ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు పరిష్కారమవుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఉప్పల్ లో స్కైవాక్ పూర్తయిందని, మెహదీపట్నంలో కూడా స్కైవాక్ ఏర్పాటుకి సిద్ధమైనా.. కంటోన్మెంట్ స్థలం అడ్డుగా ఉందన్నారు. హైదరాబాద్ లో 142 లింక్ రోడ్లు ప్లాన్ చేశామని.. అక్కడక్కడ కంటోన్మెంట్ స్థలాలు అడ్డుగా ఉన్నాయన్నారు. వాటి విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించాలని చెప్పారు. కంటోన్మెంట్ పరిధిలోని లీజ్ ల్యాండ్ లను కార్పొరేషన్ కి బదలాయించాలని రాజ్ నాథ్ సింగ్ ని కోరినట్టు తెలిపారు కేటీఆర్.

కంటోన్మెంట్ బోర్డ్ స్థలాలను ఇతర ప్రాంతాల్లో కార్పొరేషన్లకు బదలాయిస్తున్న ఉదాహరణలను ప్రస్తావించారు మంత్రి కేటీఆర్. లక్నో, బెంగళూరు, అహ్మదాబాద్ లో కంటోన్మెంట్ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారని, హైదరాబాద్ లో మాత్రం ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఈరోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం ముగిసిందని, రేపు మరో మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ని కలుస్తామన్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్ (ఎస్.ఆర్.డి.పి.) గురించి వివరిస్తామన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా అడిగామని, ఆయన అనుమతిస్తే కలసి వెళ్తామన్నారు. పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణానికి కూడా కేంద్రం సహకారం కావాలన్నారు మంత్రి కేటీఆర్. ఒకవేళ కేంద్రం సహకరించకపోతే.. వారి సహాయ నిరాకరణను ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు.

First Published:  23 Jun 2023 8:42 AM GMT
Next Story