Telugu Global
Telangana

ఢిల్లీలో కేటీఆర్ రెండోరోజు పర్యటన షెడ్యూల్

తమ తప్పు లేకుండా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నామని, అయినా కూడా సహాయం చేయకపోతే ప్రజా క్షేత్రంలో వారి తీరుని ఎండగడతామని హెచ్చరించారు మంత్రి కేటీఆర్.

ఢిల్లీలో కేటీఆర్ రెండోరోజు పర్యటన షెడ్యూల్
X

ఢిల్లీలో మంత్రి కేటీఆర్ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. మొదటి రోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలసిన కేటీఆర్, రెండోరోజు మరో మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కాబోతున్నారు. తెలంగాణ తరపున ఆయనకు వినతిపత్రం ఇస్తారు కేటీఆర్. హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికితే ఆయనతో కూడా కేటీఆర్ సమావేశమవుతారు.

నమ్మకం లేదు, కానీ..

9 ఏళ్లుగా తెలంగాణకు సాయం చేయని కేంద్రం ఇప్పుడు కొత్తగా తమ వినతులను వింటుందని అనుకోవడంలేదన్నారు మంత్రి కేటీఆర్. అయినా కూడా తమవైపు తప్పు ఉండకుండా తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా తాము కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కంటోన్మెంట్ బోర్డ్ ల పరిధిలో ఉన్న స్థలాలను స్థానిక ప్రభుత్వాలకు అప్పగిస్తున్న కేంద్రం, హైదరాబాద్ లో మాత్రం అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు కేటీఆర్. స్కై వేల నిర్మాణంలో అవసరం ఉన్న చోట కంటోన్మెంట్ స్థలాలను తమకు అప్పగించాలని రక్షణ మంత్రిని కోరారు.

ఎందుకీ వివక్ష..?

ఉత్తర ప్రదేశ్ లో 10 చోట్ల మెట్రో రైల్ కారిడార్ లకు సహకారం అందించే కేంద్రం, తెలంగాణలో హైదరాబాద్ మెట్రోకి మాత్రం సహాయ నిరాకరణ ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. తమ తప్పు లేకుండా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నామని, అయినా కూడా సహాయం చేయకపోతే ప్రజా క్షేత్రంలో వారి తీరుని ఎండగడతామని హెచ్చరించారు. రాజ్ నాథ్ సింగ్ తో జరిగిన చర్చల విషయంలో ఆయన సానుకూలంగా స్పందించారా.. లేదా.. అనే విషయం తేలలేదు. కనీసం రక్షణ మంత్రి ఆఫీస్ నుంచి కూడా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈరోజు హర్దీప్ సింగ్ పూరితో మంత్రి కేటీఆర్ భేటీ జరగాల్సి ఉంది.

First Published:  24 Jun 2023 3:44 AM GMT
Next Story